Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఉప్పల్, మారెడుపల్లి, షేక్పేట్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఖైరతా బాద్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో దంచి కొట్టింది. ఒక్కసారిగా సాయంత్రం సమయంలో కురిసిన వర్షానికి చాలా కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాం తాలు జలమయం అయ్యాయి. నాలాలు, డ్రయినేజీలు పొంగిపొర్లాయి. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడం, ఒక్కసారిగా అందరూ రోడ్లపై రావడం, అదే సమయంలో భారీ వర్షం కురవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామైంది. ప్రధాన రహదారుల నుంచి కాలనీల రోడ్లు చెరువులను తలపించాయి. ఇంటి ముందు పార్కు చేసిన వెహికిల్స్ పూర్తిగా నీట మునగడంతో పాటు వర్షపునీరు ఇండ్లలోకి చేరింది. రాజ్ భవన్ రోడ్డులో నడుం లోతు నీరు చేరడంతో వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది గా మారింది. వరద నీటిలో ఇంజన్లు ఆగిపోవడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది వాహనాలను అవతలకు దాటించారు. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు ముందు రోడ్డుపై నీరు చేరి చెరువులా మారింది. ఫలితంగా వాహనాల రాకపోకలు ఆటంకం కలగడంతో పంజాగుట్ట వరకు ట్రాఫిక్ జామైంది. బీఎస్ మక్తాలో ద్విచక్ర వాహనాలు పూర్తిగా నీట మునిగిపోయి ఇండ్లలోకి నీరు వచ్చింది. అదే విధంగా ప్రగతిభవన్ ముందు భారీగా వరదనీరు చేరడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి నీరు నిలిచిన ప్రాంతాల్లో నీటిని ఖాళీ చేసే పనులు చేపట్టారు. నగరంలో రానున్న మూడ్రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.