Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రభుత్వాలు మారినా, ప్రజా ప్రతినిధులు మారినా జల్పల్లి మున్సిపల్ వచ్చే ప్రధాన రహదారులు పూర్తిగా అధ్వాన్నంగా మారి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని జల్పల్లి మున్సి పాలిటీ ఎమ్మార్పీఎస్ నాయకులు యంజాల అర్జున్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు సూరెడ్డి జంగారెడ్డిలు ఆరోపించారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ జల్పల్లి నుంచి హైదరాబాద్‌కి వెళ్లే ప్రధాన రహదారి మరాఠా భవన్ వద్ద చెరువును తలపిస్తుందని, శ్రీశైలం ప్రధాన రహదారి జల్పల్లి గేట్ నుండి జల్పల్లి వరకు ఉన్న ప్రధాన రోడ్డు, జల్పల్లి నుండి నుంచి షాహీన్ నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా అధ్వానంగా, గుంతల మయంగా మారాయని, చిన్నపాటి వర్షం పడితే చాలు ఈ రహదారులు చెరువులను తలపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మున్సిపాలిటీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు రోడ్ల మరమ్మతుల కోసం మంజూరు చేయడం జరిగిందని ప్రజా ప్రతినిధులు చెప్పడం తప్ప ఆచరణలో కన్పించటంలేదని వారు ఆరోపించారు. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిధులు మంజూరు చేయించి వెంటనే ఈ రహదారులను మరమ్మతులు చేయించి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించడం కోసం కషి చేయాలని కోరారు.