Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
జీహెచ్ఎంసీ జవాన్ శ్రీనివాస్ కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్నాడని, అతనిపై చర్య తీసుకోవాలని నాగోల్‌లో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులు డిమాండ్ చేశారు. వేధింపులు అరికట్టాలని శుక్రవాంర డీసీసీ ఆఫీసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జీహెచ్ఎంసీ గ్రూపుల పనిచేస్తున్న దానికంటే, అదనంగా గంట తర్వాత ఇక్కడ సంతకాలు తీసుకుంటున్నారని సీఐటీయూ జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి, ఎల్బీ నగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్యలు తెలిపారు. జవాన్ శ్రీనివాస్ మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అతనిపై చర్య తీసుకోవాలని గతంలోనే డీసీకి వినతి పత్రం ఇచ్చామన్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని, దిక్కున్నచోట చెప్పుకోండని కార్మికులను జవాన్ శ్రీనివాస్ వేధిస్తున్నాడంటూ కార్మికులు తమవద్ద ఆవేదన వ్యక్తం చేశారన్నారు. మిగతా కార్మికుల గ్రూప్‌ల కంటే ఆలస్యంగా నాగోల్ కార్మికులవద్ద వేలిముద్రలు తీసుకుంటున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి ఎల్లయ్య జీహెచ్ఎంసీ కార్మికులు శ్యామల జి. అండాలు, యు. స్వరూప, కే. కళమ్మ, మేకల బాలమణి, లక్ష్మి, మైసయ్య, అంజమ్మ, తదితరులు పాల్గొన్నారు.