Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధూల్‌పేట్
హైదరాబాద్ పాతబస్తీ అంటే లావాదేవీలన్నీ ఉర్దూలోనే జరుగుతాయి. తెలుగు వారు కూడా ఇక్కడ ఉర్దూలోనే మాట్లాడతారంటే అతిశయోక్తి కాదేమో. ఛత్తాబజార్ లక్కడ్ కోట్ వీధిలో ఓ యువకుడు మాత్రం రాత్రింబవళ్లు తెలుగు భాష పురోభివృద్ధికోసం పాటుపడుతున్నాడు. మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగు భాషలో అక్షర సేద్యం చేస్తున్న ఆ యువకుడి గురించి మాతృ భాషాదినోత్సవం సందర్భంగా..
ముహమ్మద్ ముజాహిద్ వృత్తిరీత్యా జర్నలిస్టు. కంప్యూటర్ ఆపరేటర్ స్థాయినుంచి మొదలైన అతని ప్రస్థానం రచయితగా ఎదిగాడు. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్టు ఎడిటోరియల్ బోర్డులో పనిచేస్తున్నాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన ముహమ్మద్ ముజాహిద్ ఉర్దూ-తెలుగు అనువాదకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. పలు ఉర్దూ గ్రంథాలకు తెలుగు రూపమిచ్చిన తీరు ఆకట్టుకుంది. ఎంతోమంది పండితుల నుంచి ప్రశంసలందుకున్నాడు. వందలాది సాహిత్య, సామాజిక అంశాలపై వందలాది వ్యాసాలు రాసి ప్రముఖ సాహితీవేత్తల నుంచి ప్రశంసలూ అందుకున్నాడు. పిల్లల కోసం పలు నీతి కథల పుస్తకాలు రాశాడు. బాలవనం పేరుతో అచ్చయిన కథల పుస్తకం వేలాది కాపీలతో పిల్లల ఆదరణ
సంపాదించుకున్నాడు. ఇటీవలె వెలువరించిన తన స్వీయరచన ఇస్లామ్ వెలుగు, ఇస్లామ్ జీవన తరంగాలు పుస్తకాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పదాల పొందికతో ముజాహిద్ రాసే కవితలు, పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత కొలకనూరి ఇనాక్, సినారె, సిధారెడ్డి, గీటురాయి పత్రిక సంపాదకులు ఎస్.ఎం.మలిక్, డాక్టర్ ద్వానా శాస్త్రి, సీనియర్ జర్నలిస్టు ఆర్వీరామారావ్ తదితరులు ముజాహిద్ సాహిత్య కృషిని కొనియాడారు. ప్రముఖ దినపత్రికలు, వారపత్రికలు చదివేవారికి ముజాహిద్ చిరపరచితుడిగా మారిపోయాడంటే అతిశయోక్తి కాదేమో. ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక, పాలన విషయాలెన్నో తన రచనల్లో ఉట్టిపడతాయి. చక్కని సమాధానపరుస్తాయి. ఏళ్లతరబడి విలేకరిగా, పలు పత్రికల్లో ఆధ్యాత్మిక వ్యాసాలు రాసిన అనుభవంతో ఇప్పుడు పుస్తక రచనల్లో లీనమయ్యాడు.
జూమ్ యాప్‌లో తెలుగు పాఠాలు..
లాక్ డౌన్లో ఓ సంస్థ వారు నిర్వహించిన తెలుగు భాషా శిక్షణలో తెలుగు పాఠాలు నేర్పించాడు. తెలుగు మాట్లాడటం, చదవడం రాని ఎంతోమంది ప్రవాసులు జూమ్ యాప్ లో ముజాహిద్ దగ్గర తెలుగు పాఠాలు నేర్చుకున్నారు.