Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
పశు సంపదను కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని గౌ జ్ఞాన్ ఫౌండేషన్ ప్రతినిధులు హరీష్, నితీష్ విమర్శించారు. ఆదివారం బషీర్ బాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పశు చట్టాలపై హైకోర్టు ఆదేశాలు అమలు జరిపి, పశు సంపదను కాపాడాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకూ పశు మాఫియా పేట్రేగిపోతుందని, అక్రమ మార్గంలో రాష్ట్రవ్యాప్తంగా తరలిస్తున్న సుమారు 15 వందలకు పైగా పశు సంపదను వధకు గురికాకుండా తమ సంస్థ కాపాడిందన్నారు. చట్టవిరుద్ధంగా పశు మాఫియా పెద్దఎత్తున కొనసాగుతుందని, ఈ మాఫియా వెనుక బడా వ్యక్తుల పాత్ర దాగి ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో వారం రోజుల్లోనే 332 పశువులను తమ సంస్థ ద్వారా రక్షించామని, 11 వాహనాలు, పది మందికి పైగా పోలీస్ కేసులు కేవలం నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో నమోదు అయ్యాయని గుర్తు చేశారు. స్పష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం, పశు సంపదను కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమవడం శోచనీయమన్నారు. పశువుల రక్షణకు ప్రభుత్వాలు, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.