Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దోమల నివారణతో డెంగ్యూ, మలేరియా, ఇతర దోమకాటు వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్టు డాక్టర్ రాంబాబు అన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా, దోమలు వృద్ధి చెందకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూ ప్రజలకు వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
'ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు' అనే నినాదంతో దోమల నివారణకు అవగాహన, ఆరోగ్య సదస్సులను ఆరు జోన్లలోని 30 సర్కిళ్ల పరిధిలో ఆదివారం కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. ఈ అవగాహన, ఆరోగ్య సదస్సులకు ఎంపీలను, ఎమ్మెల్యేలను, మేయర్, డిప్యూటీ మేయర్లను, ఎమ్మెల్సీలను, కార్పొరేటర్లను, ప్రజా ప్రతినిధులను, వీఐపీలను, జీహెచ్ఎంసీ అధికారులను, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులను, పొదుపు సంఘాల మహిళా సభ్యులను పిలుస్తున్నామని, వారిని భాగస్వామ్యం చేస్తూ ప్రతీ ఆదివారం 10 గంటలకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆదివారం ఆరు జోన్ల పరిధిలోని 150 డివిజన్లలో 4,113 మంది ప్రజల భాగస్వామ్యంతో, వారానికి ఒకసారి ఎవరి ఇంట్లో వారు దోమల పెరుగుదలకు ఉపయోగపడే వస్తువులను తొలగించాలని వివరిస్తూ ముఖ్యంగా ఇండ్లు, ఇండ్లు పరిసరాలు, ఆఫీసులు, పరిశ్రమలు, మూతలు లేని ఓవర్హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు ,సిమెంట్హౌస్ తొట్టిలు, కుండీలు, కూలర్లు, నల్లగుంతలు, పాత టైర్లు, పూల కుండీల కింద ప్లేట్లు, తాగి పడేసిన కొబ్బరిబొండాలు, ఇతర పనికిరాని పగిలిపోయిన వస్తువులలోని నిల్వ నీటిలో దోమలు గుడ్లు పెట్టి పెరుగుతాయని, వీటన్నిటిని తొలగించుకోవాలని ప్రజలకు డాక్టర్ రాంబాబు విజ్ఞప్తి చేశారు. దోమల వ్యాప్తి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దోమల రహిత నగరం కోసం కలిసి పోరాడుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో 30 సర్కిళ్ల అసిస్టెంట్ ఎంటమాలజీస్ట్లు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.