Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హిమాయత్‌నగర్ వెళ్లే నారాయణగూడ ప్రధాన రోడ్డు అవంతి డిగ్రీ కళాశాల, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎదురుగా గత ఏడాది కాలంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం ప్రధాన రోడ్డుపై గుంతలు తవ్వి రోడ్డు పక్కనే ఉన్న వ్యాపార సముదాయాల ఎదుట మట్టి కుప్పలను పోసిమరిచారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఏమోగానీ, తవ్విన మట్టి కుప్పలను నిర్లక్ష్యంగా రోడ్డుపైనే ఉంచడంతో వర్షం కురిసినప్పుడల్లా, వరద నీరు అక్కడి ఇండ్లు, వ్యాపార సముదాయాల్లోకి చేరుతుందని స్థానికులు, వ్యాపారస్తులు వాపోయారు. నిత్యం వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు సంచరించే ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద మట్టి కుప్పలు, మురుగు నీరు, డ్రయినేజీ పైపులైన్ వల్ల పాదచారులు, వాహనదారులు, స్థానిక ప్రజలు, అక్కడ ఉన్న షాప్ యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే ప్రధాన రోడ్డు పక్కన ఉన్న మట్టి కుప్పలు, అక్కడి డ్రయినేజీ వ్యవస్థను బాగు చేసి, సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు.
సమస్యను వెంటనే పరిష్కరించాలి
నారాయణగూడ ప్రధాన రోడ్డుపై నిత్యం డ్రయినేజీ మ్యాన్ హోల్స్ లీకై మురుగు, వరద నీరు, ఇళ్లు, వ్యాపార సముదాయాల్లోకి వచ్చి చేరడంతో దుర్వాసన వస్తుంది. ప్రధానమైన ఈ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి. లేకపోతే అక్కడి స్థానికులు, వ్యాపార యజమానులతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగుతాం.
-మహ్మద్ గౌస్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు
కస్టమర్స్ రాక నష్టపోతున్నాం
వ్యాపార సముదాయాల ఎదుట ఏడాది కాలంగా పెద్ద పెద్ద మట్టి కుప్పలు నిలిపి ఉంచారు. దీని వల్ల వర్షపు, మురుగు నీరు నిలిచిపోవడతతో తమ షాపుల్లోకి కస్టమర్స్ రాక తీవ్రంగా నష్టపోతున్నాం. వెంటనే తమ షాపు ఎదుట ఉన్న మట్టి కుప్పలను పూర్తిగా తొలగించాలి.
- బాలకష్ణ, స్థానిక వ్యాపారి, హిమాయత్‌నగర్