Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్/సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పేదలకు కేటాయించాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద రెండు రోజులపాటు నిర్వహించిన రిలే నిరాహారదీక్షలు మంగళవారం ముగిశాయి. మొదటి రోజు దీక్షలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. రెండో రోజు దీక్షలను ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి ప్రారంభించారు. అయితే దీక్షల ముగింపు సందర్భంగా సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే పథకం ప్రారంభించి ఏడేండ్లు గడిచినా పేదలకు నిరాశే ఎదురైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2,91,000 ఇండ్లను మంజూరు చేయగా గ్రేటర్లో 70 వేలు, రాష్ట్రంలోని మిగతాచోట్ల 50 వేలు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు గ్రేటర్లో నాలుగువేల మందికి, రాష్ట్రంలోని మిగతా అన్నిచోట్ల కలిపి 10 వేల మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారని వివరించారు. ఇండ్లు నిర్మించడంలో, పేదలకు అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జేఎన్ఎన్యూఆర్ఎం, రాజీవ్ గృహకల్ప స్కీమ్ కింద నిర్మించిన వేలాది ఇండ్లు శిథిలమై పోతున్నా వాటిని కేటాయించడం లేదన్నారు. పూర్తయిన ఇండ్లను కూడా పేదలకు కేటాయించకుండా వచ్చే ఎన్నికల దాకా జాప్యం చేయడం అత్యంత దుర్మార్గని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో ఇండ్లులేని నిరుపేదలు గ్రేటర్ హైదరాబాద్‌లో 4 లక్షల 57 వేల మంది ఉన్నట్టు గుర్తించారని తెలిపారు. ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఏడు లక్షలని, వీరి నుంచి లబ్దిదారులను గుర్తించడానికి ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదని అన్నారు. ఇండ్లు ఇప్పిస్తామని దళారులు పేదలను దోచుకుంటున్నారని, వేల రూపాయిల అద్దెలు చెల్లించలేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. లబ్దిదారులను గుర్తించడానికి గతేడాది జీఓ.నెం.4ను నవంబర్‌లో జారీ చేసినా, ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏడు బడ్జెట్లలో ఇండ్ల నిర్మాణానికి కేటాయించింది రూ.23 వేల కోట్లు అని, విడుదల చేసింది రెండు వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.1,300 కోట్లు కాగా, మిగతా రూ.9 వేల కోట్లు హడ్కో నుండి తెచ్చిన అప్పులతో ఇండ్లు నిర్మించారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేసి ఉంటే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇప్పటికే అందేవని, తెచ్చిన అప్పులపై ఏటా వందల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నా, ప్రభుత్వం కట్టిన ఇండ్లను మాత్రం పేదలకు అందించకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నదని విమర్శించారు. కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.అరుణజ్యోతి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన స్కీమ్‌లో భాగంగా సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకునే వారికి రూ.5 లక్షల సహాయం అందిస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదన్నారు. సొంతంగా ఇల్లు కట్టుకునే పేదలకు రూ.10 లక్షలు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో రెండు లక్షల ఇండ్లు నిర్మిస్తామని లక్ష ఇండ్లను మాత్రమే నిర్మించారని చెప్పారు. 2018 చివరి నాటికి ఇండ్లివ్వకుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లే అడగం అని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు. ఆ తర్వాత కెేటీఆర్ అనేక డెడ్లైన్లు మార్చారని, నేటికీ నగరంలో ఇండ్లు కేటాయించింది 4 వేల మందికి మాత్రమేనని చెప్పారు. 70 వేల ఇండ్లు పూర్తయ్యాయని చంచల్‌గూడ సభలో ప్రకటించిన కేటీఆర్, లబ్దిదారులకు ఎప్పుడిస్తారోమాత్రం చెప్పలేదన్నారు. కనీసం లబ్దిదారులను గుర్తించే పనికూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దికోసమే తీవ్ర జాప్యం చేస్తున్నారని స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు. గ్రేటర్లో రెండు లక్షల ఇండ్లు నిర్మిస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం, స్థలాలు దొరకడం లేదని, తన వాగ్దానాన్ని పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. నిర్మించిన ఇండ్లు కూడా నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని, మరోవైపు ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం అత్యంత విలువైన భూములను తెగనమ్ముతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత విలువైన రైల్వే భూములను అమ్మేస్తున్నదని, ప్రజా ప్రయోజనాల కంటే ఆస్తుల అమ్మకంపైనే ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయన్నారు. ఈ దీక్షలో సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు కెఎన్.రాజన్న, కమిటీ సభ్యులు ఎం.మహేందర్, ఎన్.మారన్న, సి.మల్లేష్, ఎం.అజరుబాబు, జి.నరేష్, ఆర్.వెంకటేష్, నాయకులు జి.కిరణ్, ఆర్.అశోక్, పి.మహేందర్, యాదగిరి, శేషగిరిరావు, జావెద్ తదితరులు పాల్గొన్నారు.