Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఈనెల 3న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో జరుపతలపెట్టిన ధర్నాను విజయ వంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజ్ రవీంద్రాచారి అన్నారు. గురువారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజ్ రవీంద్రాచారి, కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌లో అనేక భూసమస్యలకు కేంద్రంగా మారిందని, వాటి ఫలితంగా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 3న ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధరణి పోర్టల్‌లో జరుగుతున్న భూ అవకతవకలు, భూముల వేలం వంటి పలు ప్రజావ్యతిరేక విధానా లకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డిలు విచ్చేసి ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. ధరణి పోర్టల్‌లో అవకతవకల పరిష్కారానికి జిల్లాలోని ఖానామెట్, పుప్పాలగూడ ప్రభుత్వ భూముల వేలంపాట నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ భూములు, భూదాన్ భూములను ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.
అర్హులైన పేదలందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ధరణి పోర్టల్ బాధితులు ఇతర భూ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.