Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అధికారుల నిర్లక్ష్యం, ఏజెన్సీల నిర్వాకంతో గ్రేటర్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని టాయిలెట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సగానికి సగం టాయిలెట్లను రోజువారీగా శుభ్రం చేయడంలేదని 'సిటిజన్ ఫీడ్ బ్యాక్' నివేదికలో వెల్లడైంది. టాయిలెట్లను శుభ్రం చేయలేని జీహెచ్ఎంసీ ఓడీఎఫ్, ఓడీఎఫ్+, ఓడీఎఫ్++, వాటర్+ నగరంగా అవార్డులు వచ్చాయని హడావుడి చేస్తున్నారు. నిత్యం వివిధ పనులు, విధుల నిమిత్తం నగరంలో ప్రయాణించే వారి సౌకర్యార్థం జీహెచ్ఎంసీ పరిధిలో 10,200 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ వాటిని ప్రారంభించడం ఒకెత్తయితే ప్రారంభించినవాటి నిర్వహణలేక మళ్లీ మూసేస్తున్నారు.
కోటి జనాభాకు 10వేలు
స్వచ్ఛ భారత్ నిబంధనల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక టాయిలెట్ అందుబాటులో ఉండాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో కోటి జనాభా ఉంటుందని అధికారులు అంచనా. ఈ లెక్క ప్రకారం 10వేల పబ్లిక్ టాయిలెట్లు అవసరముంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఆయా సంస్థల ఆధ్వర్యంలో బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీఓటీ) పద్ధతిలో నడుస్తున్న రెండు వేల టాయిలెట్లు ఉన్నాయి. మరో 8వేల టాయిలెట్లకుగాను లూ కేఫ్ ఆధ్వర్యంలో 1000 టాయిలెట్లు, బీఓటీలో మరో 1000 టాయిలెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సుమారు రూ.100కోట్లకుపైగా ఖర్చుచేసి టాయిలెట్లను నిర్మించారు.
నిర్వహణకు రూ.25కోట్లు
జీహెచ్ఎంసీ పరిధిలోని బీఓటీ, లూకేఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టాయిలెట్లు మినహా మిగిలిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు నెలకు రూ.2కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.25కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. 20పబ్లిక్ టాయిలెట్లను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రయివేట్ ఏజెన్సీకి ఇవ్వాలని, ఈ క్లస్టర్లో ఉన్న మరుగుదొడ్లను ప్రతి రోజు ఐదు విడతలు నిర్దేశిత సమయాల్లో పరిశుభ్రం చేయడానికి ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పిగించారు. అయితే టాయిలెట్ల నిర్వహణపై పర్యవేక్షణ కరువైంది. గతంలో టాయిలెట్ల నిర్వహణ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో పర్యవేక్షించేవారు. కాని జోనల్, సర్కిల్ స్థాయిలో ఇవ్వడంతో ఎక్కడ టాయిలెట్ ఉంది? ఎన్ని టాయిలెట్లు ఉన్నాయి? వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
సగమే క్లీనింగ్
జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో 2,218 టాయిలెట్లను మ్యాపింగ్ చేశారు. వీటిని ప్రతిరోజూ ఐదుసార్లు క్లీన్ చేయాలని నిర్ణయించారు. అయితే వీటిలో సగం టాయిలెట్లను మాత్రమే క్లీన్ చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ స్వచ్ఛ భారత్ మిషన్ విభాగం నిర్వహించిన సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో వెల్లడైంది. ఆరు జోన్లలోని 2,218 టాయిలెట్లకుగాను 1114 టాయిలెట్లను మాత్రమే క్లీన్ చేస్తున్నారని, మరో 1104 టాయిలెట్లను క్లీన్ చేయడంలేదని వెల్లడించారు. మొదటి సారి 814, రెండోసారి 215, మూడోసారి 68, నాల్గోసారి 12, ఐదోసారి 5 టాయిలెట్లను మాత్రమే శుభ్రం చేస్తున్నారంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో మరీ అధ్వాన్న స్థితిలో టాయిలెట్లు ఉన్నాయి. ఎజెన్సీలకు కోట్లాది రూపాయలు కట్టబెడుతున్న టాయిలెట్లు మాత్రం మారడంలేదని నగరవాసులు మండిపడుతున్నారు.