Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఫిట్నెస్ లేని పాఠశాలల బస్సులపై రవాణాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్కూళ్లు ప్రారంభమైన మూడవ రోజూ గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లఘించి విద్యార్థులను తరలిస్తున్న 10 పాఠశాల బస్సులపై కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకున్నారు. మరో 11 వాహనాలపై కేసులు బుక్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 38 బస్సులపై కేసులు నమోదు చేసి.. సీజ్ చేశారు. పాఠశాలల పున:ప్రారంభం నేపథ్యంలో సాగుతున్న ప్రత్యేక డ్రైవ్ శుక్రవారం కూడా కొనసాగింది. ఈ క్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు ఉదయం నుంచే విస్తృత తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో జేటీసీ పాండురంగనాయక్ నేతృత్వంలో ఆర్టీఏ అధికారులు అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట సహా సిటీలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన డ్రైవ్‌లో 2 బస్సులను సీజ్ చేశారు. ఇందులో ఒక బస్సుకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలూ లేకపోగా, మరో బస్సుకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేవని గుర్తించారు. నగర పరిధిలో బడి బస్సులతో పాటు ఆటోలు, వ్యాన్లపై కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. రంగారెడ్డిలో డీటీసీ ప్రవీణ్‌రావు అధ్వర్యంలో శుక్రవారం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 34 బస్సులను సీజ్ చేసి.. కేసులు నమోదు చేశారు. సదరు బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్లు, ట్యాక్స్‌లు కట్టకుండా రోడెక్కినట్టు గుర్తించారు. మేడ్చల్ జిల్లాలో డీటీవో కిషన్ ఆధ్వర్యంలో ఎంవీఐ, ఏఎంవీఐలు కూకట్పల్లి, మేడ్చల్ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు 2 వాహనాలను సీజ్ చేశారు. పాఠశాల బస్సులను ఫిట్నెస్ లేకుండా నడిపినా, రవాణాశాఖ నిబంధనల ప్రకారం లేనటువంటి వాహనాలను సీజ్ చేస్తామని రవాణాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.