Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో వగలమారి రాజకీయం నడుస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు అన్నారు. సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం జనరల్‌బాడీ మీటింగ్ ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు పి.సాయిబాబా అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు, పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్‌గౌడ్ పాల్గొన్నారు. నర్సింహులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుల భూములను లాక్కొని శ్మశానవాటికలకు, గ్రామ పంచాయితీలకు పంచుతున్న కేసీఆర్ ఎందుకు పనికిరాని భూ స్వాముల భూములకు మాత్రం రైతు బంధు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ దళితులకు చేసిందేమీ లేదన్నారు. దళిత బంధు పేరుతో మరోమోసానికి తెరలేపారన్నారు. బడుగుబలహీనవర్గాల పార్టీ తెలుగుదేశం అన్నారు. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందని, అలాంటి వారికే మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పారు. కష్టకాలంలోనూ 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత హైదరాబాద్ ప్రజలకే దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేస్తే టీఆర్ఎస్ హయాంలో భూములను కభ్జాచేస్తున్నారని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనుబంధ కమిటీలను బలోపేతం చేస్తామన్నారు. అనంతరం పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్‌గౌడ్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమాన్నారు. సమాజంలో అందరిని కలుపుకుని పోయేది టీడీపీనే అన్నారు. దళితులకు టీడీపీ హయాంలో మంచి అవకాశాలొచ్చాయన్నారు. సామాన్యులు సైతం టీడీపీలో అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారని గుర్తు చేశారు. పబ్బం గడుపుకోవడం కోసమే కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నారన్నారు. గ్రేటర్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు సొంత డబ్బులతోనే పోటీ చేశారని, ఇతర పార్టీల వారు ఎన్నిప్రలోభాలకు గురిచేసినా లొంగలేదని చెప్పారు. అందరం ఐక్యతతో పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్తామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందమూరి సుహాసిని అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రాంను తీసుకుని రావాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డి పద్మావతి అభిప్రాయపడ్డారు. ప్రతి కార్యకర్త రోడ్లపై తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడే పార్టీని మరింత బలోపేతం చేసుకోగలుగుతామన్నారు. టీడీపీలో పదువులు పొంది ఇతర పార్టీలకు వలస వెళ్లిన వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఇదిమంచి పద్ధతి కాదని బిల్డర్ ప్రవీణ్ తెలిపారు. గ్రేటర్లో వర్షబాధితులకు ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వసూలు చేస్తున్నారని, చలాన్లను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్‌గౌడ్, ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్ (ఆర్పీ), పార్టీ అధికారిక ప్రతినిధి టీ.జోత్సనాతోపాటు నాయకులు సి.హెచ్ విజయశ్రీ, అనిల్ కురుమ, కట్టరాములు తదితరులు పాల్గొన్నారు.