Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తాగునీటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్ లోని జలమండలి హెడ్ ఆఫీసులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగరంలోని బస్తీలు, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి సరఫరాపై జలమండలి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని తెలిపారు. కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తరచూ సెవరేజీ ఓవర్‌ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు.
ముంపునకు గురైన ప్రాంతాల్లో మంచి నీటి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎక్కువ లోతు ఉన్న మ్యాన్‌హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని, జలమండలి, జీహెచ్ఎంసీ వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని, డ్రయినేజీ పనులకు సంబంధించిన వ్యర్థాలను తక్షణం తొలగించాలని, అలాగే మంచి నీటి పైపు నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా జీఎంలు జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూతలను తెరవకూడదని సూచించారు. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసం అయినా, తెరిచి ఉంచినట్లు తెలిస్తే జలమండలి కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వివరాలకు జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313కి కాల్ చేయవచ్చన్నారు.