Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యారంగంలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని, స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకూ దిక్కులేకుండాపోయిందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) మండిపడింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా చేపట్టిన మూడంచెల ఆందోళన కార్యక్రమాలలో భాగంగా బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని వందలాది మంది ఉపాధ్యాయులతో ముట్టడించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను పరిష్కారించాలని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పటికీ.. మండల, జిల్లా స్థాయిల్లో ఆందోళనలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంవల్ల డైరెక్టరేట్ ఆఫీస్‌ను ముట్టడించాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే 'బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నారు. వేతన సవరణ లోపాలు సవరించాలన్నారు. పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్‌ను నియమించాలని, హేతుబద్దీకరణను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసోసియేట్ అధ్యక్షులు వై. అశోక్ కుమార్ మాట్లాడుతూ.. కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా చికిత్సకు గరిష్ట పరిమితిని రూ. 5 లక్షలకు పెంచి అన్ని ఆస్పత్రుల్లో రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని కోరారు. తక్షణ సమస్యలతో పాటు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చొరవ చూపకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పాఠశాల విద్య అదనపు సంచాలకుల ఆహ్వానం మేరకు రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు. అన్ని సమస్యలనూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్. తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. రమేష్, ఎం. రవీందర్, జి. తిరుపతిరెడ్డి, రావుల రమేష్, రాష్ట్ర కార్యదర్శి పి.నాగిరెడ్డి, ఎస్.కనకయ్య, మాడుగుల రాములు, వివిధ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, మండల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.