Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్ర బీజేపీ సర్కార్ దళిత గిరిజన బలహీన వర్గాలహక్కులు కాలరాస్తోందని, రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షించుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ గోల్కొండ క్రాస్‌రోడ్ వద్దగల కేవీపీఎస్ సిటీ ఆఫీసులో ఆ సంఘం జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కొండూరి యాదగిరి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. దళితులు అభివృద్ధి చెందడానికి రాజ్యాంగం నిర్ధేశించిన హక్కులు, లక్ష్యాలను పాలకులు తుంగలో తొక్కారని, వారి రాజ్యాంగపరమైన హక్కులను తొలగించే కుట్ర బీజేపీ సర్కార్ చేస్తుందని అన్నారు. ప్రయివేటీకరణ విధానలతో రిజర్వేషన్లను సమాధి చేస్తోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్ పరం చేయడం ద్వారా కార్పొరేట్ల ఊడిగం చేసి అట్టడుగు పేదల హక్కులను హరిస్తోందని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళలకు ఏమాత్రం రక్షణ లేదన్నారు. హైదరాబాద్ లో ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య సమాజానికి కళంకం అన్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు ప్రభుత్వాల నిర్లక్ష్య పాత్రకు నిదర్శనమన్నారు. దళితులు హక్కులు చట్టాలు బిక్షం ఎత్తుకుంటే రావని, పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. దళిత బంధు అమలును ఆచరణలో నిరూపించాలని ప్రభుత్వాన్ని కోరారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, కేజీ టు పీజీ విద్య, ఉచిత వైద్యం దళితులను ధనవంతులను చేస్తామన్న కేసీఆర్ హామీలన్నీ బుట్ట దాఖలయ్యాయన్నారు. సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం. దశరథ్, బి.పవన్, జిల్లా నాయకులు కిరణ్, అజరుబాబు, నారాయణ, సత్యనారాయణ విష్ణుమూర్తి, నర్సింహ లక్ష్మి, మహాలక్ష్మి, మల్లమ్మ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.