Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
లేబర్ అడ్డా భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) జనరల్ బాడీ సమావేశం బుధవారం జే.రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ యూసఫ్, ఏఐటీయూసి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంకర్రావు, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పరమేష్, మండల కార్యదర్శి టి.యాదయ్యగౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 3,4 తేదీలలో ఎల్బీనగర్లో జరుగుతున్నాయనీ, ఈ లోపు మేడ్చల్ జిల్లా మహాసభలు ఈ నెల 26న కుత్భుల్లాపూర్‌లో జరుగుతున్నాయనీ, రాష్ట్ర, జిల్లా మహాసభల్లో అన్ని రంగాల కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమాల కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్మికులు అందరూ పాల్గొని ఈ మహాసభలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికులు అందరూ ప్రభుత్వ లేబర్ కార్డు విధిగా తీసుకోవాలనీ, ఏఐటీయూసీ కార్మిక సంఘం పోరాటాల ఫలితంగా నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ పథకాలు తీసుకువచ్చిన ఘనత ఏఐటీయూసీ కార్మిక సంఘాన్నిదే అని తెలిపారు. నేరేడ్మెట్ లేబర్ అడ్డా కార్మికులకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయనీ, వాటి పరిష్కారం కోసం కృషి చేద్దామనీ, అందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంకర్రావు మాట్లాడుతూ నేరేడ్మెట్ లేబర్ అడ్డాకు సంబంధించి నూతన కమిటీ ఎన్నిక ఉంటుందనీ, వినాయక్‌నగర్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 19న సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నాయకులు, కార్మిక సంఘం సభ్యులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు సత్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఆర్.వెంకటేష్, ఉపాధ్యక్షులు జై.రమణ మేస్త్రీ, శంకర్‌గౌడ్, రెడ్డప్ప, పాల్ మేస్త్రీ, అలివేలు, రాజేశ్వరి, సోమయ్య, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.