Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్లిష్టమైన క్యాన్సర్ సమస్యలకు ట్రాన్స్ ప్లాంట్ ఆంకాలజీ అనే కొత్త స్పెషాలిటీతో మెరుగైన చికిత్స లభిస్తుందని ప్రతిమ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. సికింద్రాబాద్కు చెందిన మాధవరావు (70) కు కాలేయం నుంచి గుండెకు రక్త సరఫరా చేసే నాళంలో విస్తరించిన కాలేయ క్యాన్సర్కు చికిత్స చేసి డిశ్చార్జి చేసిన సందర్భంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాలేయ మార్పిడి సూత్రాలు, పద్ధతులను వర్తింపజేయటం ద్వారా కణితులకు చికిత్స ఈ స్పెషాలిటీలో సాధ్యమవుతుందన్నారు. బరువు తగ్గటం, ఆకలిని కోల్పోవటం, కామెర్లు, పొత్తి కడుపు, వాపు, కింది భాగంలోని అవయవాల వాపు వంటి లక్షణాలుంటాయనీ, అయితే కాలేయ క్యాన్సర్ సోకిన వారిలో 60 శాతం మందికి వ్యాధి ముదిరాకనే తెలుస్తుందన్నారు. దీర్ఘకాలంగా కాలేయ వ్యాధి ఉన్న వారికి క్యాన్సర్ సోకే అవకాశముంటుందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రాథమిక కాలేయ క్యాన్సర్తో ప్రతి ఏడా 7.88 లక్షల మంది మరణిస్తున్నారనీ, వీటిలో 60 శాతం కేసుల్లో దీర్ఘకాలికంగా హెపటైటిస్ బీ, సీ ఇన్ఫెక్షన్ల ద్వారా సంభవిస్తాయని తెలిపారు. ఏ మాత్రం అనుమానమున్నా వెంటనే వైద్యున్ని సంప్రదించాలనీ, తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన ప్రతిమ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ హరిణి బోయినపల్లి, డాక్టర్ ప్రతీక్ బోయినపల్లి, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అజిత్ సింగ్లను అభినందించారు.