Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ-హైదరాబాద్
నిరంకుశ నిజాం రాజును తరిమికొట్టిన ఘనత ఎర్ర జెండాదేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్బాస్ అన్నారు. శుక్రవారం జిల్లాలగూడలో ఆ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అబ్బాస్ మాట్లాడుతూ... దున్నేవాడికి భూమి కావాలని, వెట్టిచాకిరి రద్దు చేయాలని 1946 నుంచి 1951 వరకు ఐదేండ్లపాటు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని, ఈ పోరాటానికి కమ్యూనిస్టులు పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు వెంకటనర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, కృష్ణమూర్తి లాంటి వారు నాయకత్వం వహించారని తెలిపారు. 200 సంవత్సరాలు నిజాం రాజులు తెలంగాణలో ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని అందుకే ప్రజలు ఎదురు తిరిగి పోరాటం చేశారని అందులో తొలి అమరులు దొడ్డి కొమరయ్య, ఐలమ్మలని గుర్తు చేశారు. ఆంధ్రమహాసభతో ఈ సాయుధ పోరాటం ప్రజలను చైతన్యం చేసి బాంచన్దొర అన్నోళ్లతో కూడా బందూకులు పట్టించి నిరంకుశత్వంపై పోరాడేలా చేసిందన్నారు. ఆ పోరాట ఫలితం ద్వారా 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచారని, 4 వేల మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనని, కనీసం ఆ పోరాటంతో సంబంధం లేని కొన్ని పార్టీలు నేడు విలీనం, విమోచనం అని మాట్లాడుతున్నాయని ఎద్దేవా పేర్కొన్నారు. సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం గొడవగా అభివర్ణించడం సరైనది కాదన్నారు. సాయుధ పోరాటం భూస్వాములైన విసునూర్ దేశ్ ముఖ్, రామచంద్రారెడ్డి, చెన్నారెడ్డి, ప్రతాప్ రెడ్డిలకు ప్రజలకు మధ్య జరిగిన పోరాటం అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా రాసిన జర్నలిస్టు షోయబుల్లాఖాన్, మఖ్దూం మొయినొద్దీన్, షేక్ బందగీ లాంటి వారు నిజామ్కు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నర్సిరెడ్డి, చంద్రమోహన్, సరూర్నగర్ కన్వీనర్ ఎక్కన్న, ఎల్బీనగర్ కన్వీనర్ ఎల్లయ్య, బాలాపూర్ కన్వీనర్ అశోక్, మీర్ పేట్ కార్యదర్శి టి. కిషోర్, నాయకులు పాల్గొన్నారు.