Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మిక చట్టాల రద్దును ఉపసంహరించుకోవాలి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఎస్. వీరయ్య
నవతెలంగాణ-బోడుప్పల్
కనీస వేతనాల జీవోలను అమలు చేయకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమరం తప్పదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్మికగర్జన పాదయాత్ర సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. కార్మిక చట్టాల రద్దును ప్రభుత్వం ఉపసంహరించుకుని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 1.20 కోట్ల మంది కార్మికులకు నష్టం కలిగించేలా తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకొని, కనీస వేతనాలను సవరించాలన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మికగర్జన పాదయాత్ర శుక్రవారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాదయాత్ర బృందం సభ్యులతో కలిసి వీరయ్య మాట్లాడారు. కార్మికుల హక్కులను కాల రాయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధానాన్ని అమలు చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన పారిశ్రామిక కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ల కారణంగా కేంద్రంలో 44, వివిధ రాష్ట్రాలలో సుమారు 100 చట్టాలు రద్దు అయ్యాయని తెలిపారు. దీని మూలంగా రాబోయే కాలంలో మళ్లీ 12 గంటల పని రోజులు అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పదేండ్లుగా కనీస వేతనాలను సవరించకపోవడంతో అనేక మంది కార్మికులకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాలు నిరంతరం చేసిన పోరాటాల ఫలితంగా జూన్‌లో ప్రభుత్వం 5 జీవోలను విడుదల చేసిందని పేర్కొన్నారు. నైపుణ్యం లేని కార్మికుడి కనీస వేతనం రూ.18,019 ప్రభుత్వం నిర్ణయించిందని, సుమారు 15 ఏండ్ల అనంతరం వస్తున్న ఈ జీవోలు అమలు కాకుండా యజమానులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపల్, పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి
రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతి కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. 11వ పీఅర్సీ కమిషన్ రూ.19000 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సూచించిన సర్కారు మాత్రం రూ.17600లు ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు. కేసీఆర్ అమలు చేస్తానని చెప్తున్న దళిత బంధు కంటే ముందుగా నూటికి తొంభై శాతం మంది పారిశుధ్య కార్మికులుగా పని చేసే మున్సిపల్, పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబరు 8న రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడ కొత్తూరులో ప్రారంభమైన ఈ కార్మిక గర్జన పాదయాత్ర శుక్రవారం నాటికి సుమారు 195 కిలోమీటర్ల మేరకు చేరుకుందన్నారు. ఈ నెల 18 న చర్లపల్లి పారిశ్రామిక వాడలో జరిగే సభకు సీఐటీయూ జాతీయ. ఉపాధ్యక్షులు ఎం.ఎ గఫూర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ముందుగా చెంగిచెర్ల చౌరస్తా వద్ద పాదయాత్ర బందానికి సీఐటీయూ, మున్సిపల్, ప్రజా సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కార్మిక గర్జన పాదయాత్ర బందం సభ్యులు భూపాల్, పి.జయలక్ష్మి, సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, అధ్యక్షుడు అశోక్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎన్.సజన, సీఐటీయూ జిల్లా కోశాధికారి సబిత, శైలజ, వి.సుధా, సీఐటీయూ రాష్ట్ర నాయకులు బాల్ నరసింహ, ఉన్ని కష్ణణ్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్ రాథోడ్, ఎస్.ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు.
నేడు చర్లపల్లిలో బహిరంగ సభ
సీఐటీయూ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్మికగర్జన పాదయాత్ర శుక్రవారం నాచారం, మల్లాపూర్ మీదుగా చర్లపల్లి 5 ఫేజ్‌లోని సురాన చౌరస్తా చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటలకు ఇక్కడ భారీ బహిరంగ సభ ఉంటుందని సీఐటీయూ చర్లపల్లి అధ్యక్ష కార్యదర్శులు బివి. సత్యనారాయణ, జి. శ్రీనివాసులు తెలిపారు. సభకు సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి, ఏపీ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. గఫూర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.