Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
త్వరలో సనత్‌నగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేసేవారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. శుక్రవారం పీవీ మార్గ్‌లోని జలవిహార్‌లో మంత్రి అధ్యక్షతన సనత్‌నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందనీ, దీంతో ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై, పార్టీపై అచంచల విశ్వాసాన్ని చూరగొన్నట్టు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. పార్టీ పటిష్టానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బూత్, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 20 వ తేదీ నుంచి చేపట్టే నూతన కమిటీల ఎంపికలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. డివిజన్, బూత్ కమిటీలను, అనుబంధ కమిటీలు, నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ కోసం పనిచేసే వారికి తగు గుర్తింపు ఇస్తామని చెప్పారు. ఆయా కమిటీలను ఏకాభిప్రాయంతో ఎన్నుకునేలా చూడా లని కోరారు. పార్టీ పిలుపునిచ్చే అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేలా నాయకులు, కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాద్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చాలనే సీఎం లక్ష్యంతో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అత్యధికంగా సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోనే నిర్మించినట్టు చెప్పారు. ఇంకా బండ మైసమ్మ నగర్, సీసీ నగర్లలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి దీపావళి నాటికి లబ్దిదారులకు అందిస్తామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో రూ.రెండు కోట్లతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇంకా ఎక్కడైనా సీసీ కెమెరాలు అవసరం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై వివరాలు సమర్పించాలని కార్పొరేటర్లకు మంత్రి సూచించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, కార్పొరేటర్లు కుర్మ హేమలత, కొలన్ లక్ష్మి, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణగౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.