Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
సీఐటీయూ కార్మిక గర్జన పాదయాత్ర సోమవారం బాలానగర్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకుంటుంది. రాజుకాలనీలో సాయంత్రం 6 గంటలకు జరిగే బహి రంగ సభను జయప్రదం చేయాలని సీఐటీయూ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర జయప్రదం కోసం కార్మిక వర్గం పెద్ద ఎత్తున కదిలి రావాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ కార్మిక గర్జన పాదయాత్రలో ప్రధానంగా 73 షెడ్యూల్ ప్రకారం పరిశ్రమలో పెండింగ్ లో ఉన్న జీవోలను సవరించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన 5 జీవోల గెజిట్, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వరంగ సంస్థలు గుండె లాంటిదని, వాటిని బడా కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకమైన విధానాలు అమలు చేస్తున్నారని, వీటిని కార్మిక వర్గం తిప్పి కొట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.శంకర్, శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు