Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
రెవెన్యూ అధికారుల తప్పిదాలు పేదోళ్లకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరిట సామాన్యుల ఇండ్లను ఇష్టానుసారంగా కూల్చి వేస్తున్నారు. తాము చెప్పినట్టు వినకపోతే కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూల్చివేతలను అడ్డుకో బోయిన బాధిత కుటుంబ సభ్యులను సైతం పోలీస్ స్టేషన్‌కు తరలించి బలవంతంగా ఒప్పంద పత్రాలను రాయించుకున్నారని సదరు బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన హయత్ నగర్ మండల పరిధిలోని బాగ్ హయత్‌నగర్, ఆదర్శనగర్ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. బాధితులు, కాలనీవాసుల వివరాల ప్రకారం హయత్‌నగర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.98, 99 లో 10.03 ఎకరాల్లో లేఅవుట్ ద్వారా ప్లాట్లు చేసి విక్రయించగా నిర్మాణాలు చేపట్టుకున్నారు. దీనికి ఆనుకుని ప్రభుత్వ భూమి 2.35 ఎకరాలు ఉన్నది. ఈ ప్రభుత్వ భూమిలో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించింది. ప్రయివేటు వెంచర్లో నిర్మించుకున్న ఇంటి నిర్మాణాలను సదరు ప్రభుత్వ అధికారులు కూల్చివేసి బాధిత కుటుం బాలను, వీరికి మద్దతుగా వచ్చిన కాలనీ సంక్షేమ సంఘం సభ్యులను సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
హౌసింగ్ డీఈ, ఏఈల బెదిరింపులు..
సదరు బాధిత కుటుంబ సభ్యుల పట్ల, కాలనీ సంక్షేమ సంఘం సభ్యుల పట్ల డబుల్ బెడ్ రూం ఇండ్ల డీఈ, ఏఈ, సిబ్బందితో కలిసి నానా దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు మీడియాతో వాపోయారు. ప్రభుత్వ అధికారులకే ఎదురు చెబుతారా? అంటూ మీడియా వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం గమనార్హం. బాధిత కుటుంబ సభ్యులను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించి క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. వారితో బలవంతంగా రాజీ ఒప్పంద పత్రాలను రాయించుకున్నట్టు బాధితులు వాపోయారు.
దళితులమైన మాకు న్యాయం చేయండి : బాధితులు
దళితులమైన్నందుకే అధికారులు, పోలీసులు కక్ష గట్టి మా ఇంటిని కూల్చివేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు దుప్పెల్లి శేభారాణి, రాజ్‌కుమార్ దంపతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.