Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండగ ప్రతీక అనీ, ఆడబిడ్డల పండగను అంగరంగ వైభవంగా జరుపు కోవడం ఎంతో ఆనందకరమని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరే ట్లోని మహిళా ఉద్యోగులు, తదితరులు బతుకమ్మ పాటలు పాడుతూ పాటలకు లయబద్దంగా బతుకమ్మ ఆటలను ఆడారు. అదే ఉత్సాహంతో జిల్లా కలెక్టర్ హరీశ్ సైతం వారితో కలిసి కొద్దిసేపు బతుకమ్మ ఆటను ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండగను రాష్ట్రం ఎంతో వైభవంగా నిర్వహిస్తోందన్నారు. ఇది ఆడపడుచులకు ఇచ్చే గౌరవమని తెలిపారు. మహిళలు ఎంతో భక్తితో ఆనందోత్సాహాల మధ్య ఈ పండగను జరుపుకొంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ట్రేష రాష్ట్ర అధ్యక్షులు గౌతంకుమార్, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.