Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఓయూ ఆర్ట్స్ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ పరిశోధన చేయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని, అలాగే సెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ ఓయూ అధ్యక్షుడు సుమంత్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మొదటి తరం విద్యార్థులు పరిశోధన చేసి, సమాజ మూలాలను అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏఎస్ఏఓఎస్ అధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ మాదిరిగా స్టేట్ యూనివర్శిటీలలో కూడా పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఫెలోషిప్ అందించాలని కోరారు. పీడీఎస్యూ(వీ) రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతూ పీహెచ్డీ అడ్మిషన్ పొందిన విద్యార్థులు, నిర్దిష్ట సమయంలో పరిశోధన పూర్తి చేసేలా చర్యలు తీసుకొని, కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరారు. డీబీఎస్ఏ ఓయూ అధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ మూడేండ్లుగా పీహెచ్డీ నోటిఫికేషన్ లేనందున పరిశోధన చేయాలనుకుంటున్న విద్యార్థులు నిరాశ చెందుతున్నారని వాపోయారు. సమావేశంలో ఎస్ ఎఫ్ఐ కార్యదర్శి రవి నాయక్, బీఎస్ఎఫ్ నాయకులు వేల్పకొండ రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి కాంతి రాజ్, నాయకులు రెహమాన్, రాజేష్, నరేష్, మధు పాల్గొన్నారు.