Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
తన నీచ రాజకీయ లబ్ధి కోసం దేశంలో హింసాత్మక ఘర్షణలను బీజేపీ ప్రేరేపిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి ఘటనను ఖండిస్తూ సోమవారం నారాయణగూడ చౌరస్తాలో సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నియంత్రించే మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్డుపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల సమూహంలోకి కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా, తన గుండాలను ఉసిగొల్పి కార్ల కాన్వారుతో తొక్కించి నలుగురు రైతులను హత్య చేయడం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో లక్షలాది మంది రైతులు పది నెలలకు పైగా గత సంవత్సరం ఆమోదించిన వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా, రైతులపై హింసకు ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్ మాట్లాడుతూ భారతీయ రైతులకు సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు జరుగుతున్నాయని, అయినా పనికిరాని రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయకుండా ప్రధాని మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండకు సంబంధించి హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించి, వెంటనే సాగు నల్ల చట్టాలను రద్దు చేసి, రైతులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ మాట్లాడుతూ అహంకారం, క్రూరత్వంతో మోదీ, యోగి ప్రభుత్వాలు నిరంకుశ పాలనా కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. నిరసనలో చిందిన అమాయక రైతుల రక్తానికి మోదీ, షా, యోగిలే బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రవీంద్రచారి, రాష్ట్ర సమితి సభ్యులు ప్రేమ్ పావని, ఛాయాదేవి, ఏం.నరసింహ, మరుపాక అనిల్ కుమార్, కె.కాంతయ్య, హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు టి.రాకేష్ సింగ్, షంషుద్దీన్, నేతలు బొడ్డుపల్లి కిషన్, ఆర్.మల్లేష్, ఆరుట్ల రాజ్ కుమార్, సలావుద్దీన్, షేక్ నదీమ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.