Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఏటీఎం సెంటర్లలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న వారిని టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.95 వేల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం చింతపల్లికి చెందిన రామారావు అలియాస్ రాము ఓ ప్రయివేట్ సంస్థలో పని చేసేవాడు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఏటీఎం సెంటర్లలో డబ్బులు డిపాజిట్ చేసుందుకు వెళ్లే వారిలో అమాయకులను, ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేసేవాడు. అత్యవసరంగా డబ్బులు అవసరముందనీ, నగదు ఇస్తే ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తానంటూ నమ్మించే వాడు. డబ్బులు తీసుకుని ఆన్లైన్లో డబ్బులు పంపించినట్టు నకిలీ మెసేజ్ చూపించేవాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉడాయించేవాడు. ఇదే తరహాలో ఈ నెల12న ముషీరాబాద్‌లో నివాసముంటున్న జైత్వ్వాల్ గౌతమ్ అనే ప్రయివేట్ ఉద్యోగిని రామారావు టార్గెట్ చేశాడు. డబ్బులు డిపాజిట్ చేసేందుకు బాధితుడు గౌతమ్ ఎస్ఆర్నగర్లోని యాక్సెస్ బ్యాంకుకు వెళ్లాడు. రూ.లక్ష డిపాజిట్ చేస్తున్న సమయంలో ఏటీఎంలోకి వచ్చిన రామారావు అత్యవసరంగా డబ్బు అవసరముందనీ, తనకు ఇస్తే ఇచ్చిన మొత్తాన్ని ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తానని గౌతమ్‌ను నమ్మించాడు. రూ.లక్ష తీసుకుని నకిలీ (ఎస్ఎంఎస్) రిసిప్ట్ చూపించి అక్కడి నుంచి ఉడాయించాడు. తీరా మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్న నిందితుడు 2018 నుంచి దాదాపు 27 కేసుల్లో అమాయకులను మోసం చేసి రూ.12 లక్షలా 9 వేలను దండుకున్నాడని సీఐ తెలిపారు. అనేకసార్లు జైలుకు వెళ్లొచ్చినా నిందితుడిలో మార్పు రాలేదన్నారు.