Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
''అధికారులు, పోలీసులు ఉన్నది దేనికి? నా ప్లాట్‌ను అన్యాయంగా కబ్జాచేసి నిర్మాణం చేపడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోరా? ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేస్తారా? కబ్జాదారుల ఆగడాలను పోలీసులు, అధికారులు ఆపలేరా? అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయాను. నాకు న్యాయం చేయండి '' అని ఎస్. మాలతి అనే మహిళ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్, తనకు జరిగిన అన్యాయంపై మున్సిపల్ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాళ్లరిగేలా తిరిగినా ఏ ఒక్క అధికారి కనికరించడం లేదని వాపోయారు. వివరాల్లోకి వెళ్తే... పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని కెనరానగర్ (అన్నపూర్ణకాలనీ)లో సర్వే నెంబర్51/ఎ లోని ప్లాట్ నెంబర్ 46లో గల 386 గజాల ఖాళీ ప్లాట్‌ను జాంబాగ్‌కు చెందిన ఎన్. మాలతి 2020లో కొనుగోలు చేశారు. ప్లాట్‌లో ఎటువంటి నిర్మాణం చేపట్టకుండా ఖాళీగానే ఉంచారు. అయితే ఇటీవల టి. శ్రీనివాస్ రెడ్డి, కె.రామిరెడ్డి, బి.మాధవి, వి.ఉపేందర్ రెడ్డి అనే నలుగురు వ్యక్తులు కలిసి దానిని కబ్జాచేసి అపార్టుమెంట్ నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న మాలతి, తన ప్లాట్‌లో నిర్మాణాన్ని ఆపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాస్(మాజీ), మేడిపల్లి సీఐలను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే వారు కూడా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో మరో మార్గంలేక మంగళవారం మీడియా ముందుకు వచ్చినట్లు బాధితురాలు తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలు మాలతి మాట్లాడుతూ... తనకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను, పోలీసులను వేడుకున్నారు. లే అవుట్, రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన తన ప్లాటును టి. శ్రీనివాస్ రెడ్డి, కె.రామిరెడ్డి, బి.మాధవి, వి.ఉపేందర్ రెడ్డి అనే నలుగురు వ్యక్తులు దౌర్జన్యంగా, అక్రమంగా కబ్జాచేసిందిగాక అపార్టుమెంట్ నిర్మిస్తున్నారని తెలిపారు. తమ ప్లాటు ఉన్న సర్వే నెంబర్ 51/ఏ కాగా, సదరు కబ్జాదారుల సర్వే నెంబర్ 54/ఏ అని వివరించారు. అంతేగాక లే అవుట్ ప్రకారం తన ప్లాటుకు దక్షిణ రోడ్డు ఉందని, వారి ప్లాటుకు పడమర దిక్కున రోడ్డు కలిగి ఉందని తెలిపారు. పడమర రోడ్డు ఉన్న ప్లాటుకు దక్షిణ రోడ్డు చూపిస్తే మున్సిపల్ అధికారులు అనుమతి ఎలా ఇచ్చారో తెలియడం లేదని బోరున విలపించారు. అన్యాయంగా తన ప్లాటును కబ్జాచేసింది కాగా కబ్జాదారులు అందులో నిర్మాణం చేపడుతున్నారని వాపోయారు. ఈ నిర్మాణాన్ని ఆపడానికి తాను అనేక ప్రయత్నాలు చేశానని, అక్రమ నిర్మాణం ఆపి తన ప్లాటును కబ్జానుంచి విడిపించాలని అప్పటి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేస్తే వారు 'ఇల్లు కట్టాక గృహ ప్రవేశం చేసుకో' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని తెలిపారు. పోలీసులు కూడా తనకు న్యాయం చేయకుండా దాటవేత దోరణి ప్రదర్శిస్తున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పీర్జాదిగూడ పరిధిలో ఖాలీ ప్లాటు కనిపిస్తే కబ్జా చేసేస్తారా? చేసేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేయాలని, లేకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడుతానని హెచ్చరించారు. సమావేశంలో బాధిత మహిళ మాలతితోపాటు ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.