Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ప్రథమ ర్యాంకు తమదే అని ప్రచారం చేస్తూ తప్పుడు ర్యాంకులతో మోసం చేస్తున్న శ్రీచైతన్య, నారాయణ, ఫీట్జీ, అల్లెన్ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలపై చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హిమాయత్‌నగర్ 'వై' జంక్షన్ వద్ద కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.అశోక్ స్టాలిన్ మాట్లాడుతూ నాలుగు కార్పొరేట్ విద్యాసంస్థలకు తన ర్యాంకును ఇచ్చిన మృదల్ అగర్వాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు ర్యాంకులతో శ్రీ చైతన్య, నారాయణ, ఫీట్జీ ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులు వారి తల్లిదండ్రులను, సమాజాన్ని మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జోక్యం చేసుకుని ఆయా విద్యా సంస్థలపై, ఇలాంటి ర్యాంకుల విషయంలో ఆ విద్యార్థికి కార్పొరేట్ కళాశాలలకు ఆర్థిక లావాదేవీలు జరిగితే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తప్పుడు పద్ధతిలో విద్యాసంస్థలను ఏర్పాటు చేసి అక్షరాలపై లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ ఫీజులను దండుకుంటున్నా శ్రీచైతన్య, నారాయణ, ఫీట్జీ వంటి విద్యా సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గ్యార క్రాంతి కుమార్, మర్రి శ్రీమాన్, హైదరాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చైతన్య యాదవ్, నాయకులు ఎండీ అన్వర్, టి.హరీశ్, సామిడి వంశీవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్, ఆదిత్య, శివ, జేక్కా సాయి, దుర్గాప్రసాద్, ఆదర్శ్, విజరు, సాయితేజ, చిన్నబాబు, శివానంద తదితరులు పాల్గొన్నారు.