Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాచకొండ సీపీ మహేష్ భగవత్
పోలీస్వీరుడి తల్లికి పాదాభివందనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. వారి సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు. అంబర్‌పేట్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. దేశ రక్షణ, ప్రజా సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తూ విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమర వీరుల స్ఫూర్తిగా పనిచేయాలని కోరారు. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలను కోల్పోయి అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు. అక్టోబర్ 21న లద్దాఖ్ లో గల హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో 1959లో చైనా సైనికుల ఆకస్మిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన సి.ఆర్.పి.ఎఫ్ జవానుల త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. అనంతరం అమర జవాన్లు, హౌంగార్డుల కుటుంబసభ్యులకు నూతన వస్త్రాలను అందజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు వి.లింగయ్య తల్లి సూరమ్మకు సీపీ పాదాభివందనం చేశారు. ఈ ఘటనతో అక్కడున్న పోలీసుల కుటుంబసభ్యులు, అధికారులు నిశ్చేష్టులయ్యారు. అమరుల పట్ల మహేష్ భగవత్కున్న గౌరవాన్ని అక్కడున్న వారందరు ప్రత్యేకంగా చర్చించుకున్నారు.