Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరీశ్ సూచించారు. ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా, ఇంటర్మీడియట్ కమిషనర్ జలీల్‌తో కలిసి కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ హరీశ్ జిల్లాలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను అమర్చి పరీక్షలు పటిష్టంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా తర్వాత మొదటిసారిగా ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు సిబ్బందిని, మందులను, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎవరికైనా జ్వర లక్షణాలు ఉన్నట్లయితే వారికి ప్రత్యేక గదిని కేటాయించాలని, ఈవిషయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు పని చేయాల్సిందిగా వివరించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబడదని, ఈవిషయంలో విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, అందుకు తగినట్లుగా ఆర్టీసీ వారు సైతం ఆయా పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. ఇంటర్ పరీక్షల సమయంలో సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పరీక్షలు జరిగే సమయంలో జిరాక్సు కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కిషన్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణకు క్షేత్రస్థాయి పరిశీలనలు
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను తెలుసుకొనేందుకు జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారని, అందుకోసం ప్రత్యేక బృందాలు సైతం రానున్నట్లు కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి పథకాలపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఎన్ఎల్ఎమ్ టీమ్ జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయా పథకాలకు సంబంధించి వివరాలను తెలుసుకొంటారని అన్నారు. ఈనెల 25 నుంచి నవంబరు 2వ తేదీ వరకు ఈ బందం పర్యటిస్తోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ బృందం పర్యవేక్షణకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా సంబంధిత అధికారులు తమ పరిధిలో అమలవుతున్న వాటి వివరాలతో పాటు తదితరాలను ఎలాంటి ఆలస్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని కీసర, మూడుచింతలపల్లి మండలాల్లో కరోనా వ్యాక్సిన్ తక్కువగా నమోదైందని, ఈవిషయాన్ని గుర్తించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో పద్మజారాణి, జడ్పీ సీఈవో, డీపీవో, డీఎం అండ్ హెచ్‌వో, పంచాయతీరాజ్ ఈఈ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.