Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్లో డ్రయినేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ కింద రూ.89 లక్షలతో కవాడిగూడ ఇంద్రా పార్కు చౌరస్తా నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నూతన డ్రయినేజీ పైప్ లైన్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ రచన శ్రీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కొన్నేండ్ల నుంచి డ్రయినేజీ సమస్య తీవ్రంగా ఉండటంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు వాహనాల రాకపోకలు రద్దీ తీవ్రంగా ఉంటుందనీ, ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో డ్రయినేజీ సమస్య తలెత్తకుండా డ్రయినేజీ నీరు రోడ్లపైన ప్రవహించకుండా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన డ్రయినేజీ పైపు లైన్లను ఏర్పాటు చేసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కవాడి గూడ డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, కల్వ గోపి, రాజేష్, బీజేపీ నాయకులు వెంకటేష్, మహేందర్, వాటర్ వర్స్ అధికారులు, డీజీఎం చంద్రశేఖర్, జీఎం సుబ్బారా యుడు, తదితరులు పాల్గొన్నారు.