Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ నర్సింగ్ రావు
నవతెలంగాణ-మెహదీపట్నం
దేశ సంపదనంతా ప్రయివేటీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టపెడుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ నర్సింగ్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం మెహదీపట్నం మల్లెపల్లిలోని డివిజన్ కమిటీ హాల్లో సీపీఐ(ఎం) నాంపల్లి నియోజకవర్గ మూడో మహాసభలు జరిగాయి. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నర్సింగ్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కూడా కొనలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. పెట్రోఉత్పత్తుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజానీకం కడు దైన్య స్థితిని అనుభవిస్తున్నారని చెప్పారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులపై బీజేపీ పెద్దలు చేస్తున్న దాడులు రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మహిళలు, దళితులు, మైనార్టీలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని వాపోయారు. కానీ అది ఏమీ పట్టకుండా కేంద్రంలోని మోడీ సర్కార్, రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ కుల మత విద్వేషాలతో ప్రజలను రెచ్చగొడుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
కేరళ సర్కార్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేరళలోని వామపక్ష సర్కార్ పనితీరును ఆదర్శంగా తీసుకొని ఆ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. నాంపల్లి నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపై సీపీఐ(ఎం) నిరంతరం అధ్యయనం చేస్తూ వాటిని తీర్చేందుకు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తుందని తెలిపారు. సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం వెంకటేష్ మాట్లాడుతూ నాంపల్లి నియోజకవర్గంలో వర్షాలుపడితే ఇళ్లలో నీరు చేరుతుందని, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, డ్రయినేజీ వ్యవస్థ సక్రమంగా లేదని, తాగునీరు మురుగునీరుగా వస్తుందని, కార్మికులు అడ్డాలపై పని లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఈసమస్యలపై దృష్టి సారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. అనంతరం సీపీఐ(ఎం) నాంపల్లి నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. పార్టీ కన్వీనర్‌గా సి మల్లేష్, కమిటీ సభ్యులుగా బి శంకర్, సీహెచ్ వెంకట స్వామి, ఎండీ ఇబ్రహీం, ఎం శంకర్ యాదవ్, ఎండీ అలీ, ఎం నాగరాజు ఎన్నికయ్యారు. సమావేశంలో సీపీఐ(ఎం) ప్రతినిధులు, కార్యకర్తలు, కళాకారులు, నాయకులు పాల్గొన్నారు.