Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర సీపీ అంజనీ కుమార్
ఓయూలో పోలీసుల మార్నింగ్ వాక్
నవతెలంగాణ-ఓయూ
నగరంలో మాదకద్రవ్యాల నివారణకు అందరూ కృషి చేయాలని, ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని నగర సీపీ అంజనీ కుమార్ కోరారు. ఆదివారం ఓయూ పొలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగర పోలీసులు నిర్వహించిన 'మాదకద్రవ్యాల నిర్మూలనకు అవగాహన నడక' (మార్నింగ్ వాక్), 'స్వచ్ఛ హైదరాబాద్-గంజాయి రహిత హైదరాబాద్' అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. నగరంలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతునట్లు చెప్పారు. యువత భవిష్యత్‌పై దృష్టి సారించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ మత్తుపదార్థాల పీడ తొందరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయనే విషయాన్ని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తీవ్రంగా పరిగణించాలని, ముఖ్యంగా యువత పెడదోవ పట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల నేరస్తులు ఎంతటివారైన ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిపేర్కొన్నారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొ. డి.రవీందర్ యాదవ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ మురళీధర్, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాసులు, ఓయూ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, యువతీయువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.