Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంట ముందుగా సెంటర్లోకి అనుమతి
- నేటీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం..
- వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగునున్న పరీక్షలు
- మొత్తం 274 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
- హాజరుకానున్న 71,569 మంది విద్యార్థులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ పరీక్షలకు అంతా సిద్దమైంది. నేటి నుంచి ప్రారంభమై.. నవంబర్ 3వ తేదీతో ముగియనున్న ఇంటర్ పరీక్షలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. కరోనా కారణంగా గతేడాది ప్రభుత్వం ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు లేకుండానే సెకండియర్‌కు ప్రమోట్ చేసింది. అయితే.. అప్పట్లో ప్రభుత్వం కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే ఏ సమయంలోనైనా ఫస్టీయర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 25 నుంచి నవంబర్ 3వరకు పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లాలోని 20కుపైగా పోలీసు స్టేషన్ల పరిధిలో 274 సెంటర్ల ద్వారా 71,569 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9గంటలకు పరీక్షలు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డి.ఒడ్డెన్న ఆధ్వర్యంలో పరీక్షల ఏర్పాటు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆర్టీసీ, వైద్య, వైద్య, పోస్టల్ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణకు గాను 200 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులతో పాటు కస్టోడియన్స్ నియమించామని, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 10 మందితో సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలు, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ, హైపవర్ కమిటీలు ఏర్పాటు చేసినట్టు డీఐఈవో తెలిపారు. కాగా విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించారని ఆయన చెప్పారు. యాప్ ఆధారంగా సెంటర్లకు సులువుగా చేరుకోవచ్చునని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయలని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే జిల్లాలోని సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు ఏమాత్రం ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్‌ను ప్రత్యేకంగా నియమించారు. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్లతో పాటు ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు సరఫరాతో పాటు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోగా.. పరీక్ష కేంద్రాలకు వెళ్లే రూట్లలో ఆర్టీసీ అదనంగా ప్రత్యేక బస్సులు నడపనుంది.
'మొబైల్ యాప్'తో ఈజీగా సెంటర్‌కు..
సెంటర్ లొకేటర్ మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు సులువుగా తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం ఎక్కడ ఉన్నది.. అక్కడికి ఎంత సమయంలో చేరుకుంటారు వంటి వివరాలు సులువుగా తెలుసుకునే వీలుంది. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్ లోకి వెళ్లి సెంటర్ లొకేషన్ యాప్ అని టైప్ చేసి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. యాప్‌లో హాల్‌టికెట్ నంబర్ టైప్ చేసి సెర్చ్ చేస్తే.. విద్యార్థి ఉన్నచోటికి ఎగ్జామ్ సెంటర్ ఎంత దూరంలో ఉందో తెలిసిపోతుంది. పరీక్ష కేంద్రానికి ఏ మార్గం గుండా ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకునే అవకాశముంది. ఈ యాప్ ద్వారా హాల్ టికెట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరంలేదు. ముఖ్యంగా కాలేజీ ఫీజు పూర్తిగా చెల్లించని విద్యార్థులకు ఆయా యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్ ఇవ్వకుండా పరీక్షల సమయంలో ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు కోకోలల్లు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు గురిచేసే కాలేజీ యాజమాన్యాలకు చెక్ పేట్టేందుకే ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు.
గంట ముందు నుంచే అనుమతి..
జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ ఏడాది కూడా గతంలో మాదిరిగా గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనుంది. అంటే ఉదయం 8గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఉదయం 8గంటలకే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
విద్యార్థులు కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. మాస్కు తప్పనిసరిగా ధరించాలి. పరీక్ష కేంద్రాలకు ముందుగా చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. సెంటర్ లొకేటర్ మొబైల్ యాప్‌ను ఉపయోగించుకోవాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం.
-డి.ఒడ్డెన్న, డీఐఈవో, హైదరాబాద్
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు : ఈడీ వెంకటేశ్వర్లు
నేటి నుంచి నవంబర్ 3వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ రూట్ పాస్, హాల్ టికెట్ చూపించి ఏ రూట్లో అయినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకునే అవకాశాన్ని కల్పించామని ఆయన పేర్కొన్నారు. హాల్ టికెట్ మాత్రమే ఉంటే సాధారణ టికెట్ తీసుకోవాలని ఈడీ సూచించారు. పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు.