Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్
- ధర్నాచౌక్ వద్ద మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల రిలే నిరాహార దీక్ష
నవతెలంగాణ-అడిక్మెట్
తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన కనీసవేతనాల జీవోలను వెంటనే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్. బోస్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వందలాది మంది మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈదీక్షలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్. బోస్ హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 21 నుంచి 25 జీవోలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవోల అమలుకోసం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సాధించడంతోపాటు వారిని పర్మినెంట్ చేసేవరకు ధర్మపోరాటం చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యజమానుల కోసం పనిచేస్తున్నారని, కార్మికుల పక్షాన లేరని ధ్వజమెత్తారు. జీవోలు అమలు చేసే వేతనాలు ఇవ్వలేమని యజమానులు చెప్పటం శోచనీయమని అన్నారు. కేంద్రస్థాయిలో పనిచేసేవారికి రూ.21 వేలు, రాష్ట్రస్థాయిలో పనిచేసే వారికి రూ.19,500 ఎలా ఇస్తారని నిలదీశారు. మానవత్వంతో పనిచేస్తున్న మెడికల్ ఉద్యోగులకు వేతనాలు తక్కువ, మానవత్వం లేనివారికి వేతనాలు ఎక్కువ అని అన్నారు. ఆదాని, అంబాని గంట ఆదాయం రూ.95 కోట్లు అని, అదే మెడికల్ కార్మికులకు మాత్రం గంటలకు రూ.40-50 మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు లేబర్ యాక్టును మార్చేస్తున్నారని, జీవితాంతం కాంట్రాక్టు లేబర్గానే పనిచేయాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన చెందారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎండీ యూసుఫ్ మాట్లాడుతూ 5 జీవోల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని ధ్వజమెత్తారు. గవర్నర్, ముఖ్యమంత్రి సంతకాలు చేసినా కార్మికశాఖ అధికారులు జీవోలు విడుదల చేశారు తప్ప అమలుచేయడానికి చిత్తశుద్ధితో పనిచేయడంలేదని విమర్శించారు. జీవోలు అమలుచేసి కనీసవేతనాలు ఇవ్వాలని, లేనిపక్షంలో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈధర్నాలో అసీనాబేగం, జయలక్ష్మి, రాధిక, కుంటాల రాములు, మేకల దాసు, కుమార్, సుధాకర్, వాణి, రవీందర్, ప్రమీల, సంతోష్, కె. మల్లేశ్, మహ్మద్ఫి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.