Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో ఫ్లెక్సీ రగడ నడుస్తోంది. టీఆర్ఎస్ 20 ఏండ్ల ప్లీనరీ నేపథ్యంలో సిటీలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిపై విమర్శలు వస్తున్నాయి. 'నగరరంలో ఫ్లెక్సీలు, కటౌట్లు నిషేధం. రాజకీయ నేతలు తమ ముఖాలు చూసుకోవడానికి మాత్రమే ఇవి పనికొస్తాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుంది' అని పురపాలకశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని ప్రతిపక్షపార్టీల నేతలు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు చిన్నచితకా స్కూల్, టిఫిన్ సెంటర్లు, చివరకు 'టూ లెట్' బోర్డులను సైతం వదలని జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్(సీఈసీ) ఎందుకు స్పందించడంలేదని మండిపడుతున్నారు. ఫ్లెక్సీ ఏర్పాటుకు నిరసనగా యూత్ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు.
పెనాల్టీ ఏమైంది?
టీఆర్ఎస్ ఫ్లీనరీ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రధాన కూడళ్లు, రహదారులు, సెంటర్లు, కాలనీల్లో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గల్లీ లీడర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. అయినా జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నయాపైసా పెనాల్టీ వేయలేదు. ట్వీట్టర్ వేదికగా చాలా మంది నెటిజన్లు ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ స్పందించలేదు. గతంలో మేయర్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు ఓ కార్యకర్తకు రూ.4 లక్షలకుపైగా పెనాల్టీ వేశారు. చిన్నచిన్న ప్రయివేట్ స్కూల్ బోర్డులు పెట్టుకుంటే వేలాది రూపాయల పెనాల్టీ వసూలు చేశారు. అద్దె కోసం బోర్డులు పెట్టుకున్నా వదలని జీహెచ్ఎంసీకి ఫ్లెక్సీలు కనబడడంలేదా? టీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ ఏమైనా ప్రత్యేకంగా అనుమతిచ్చిందా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సీఈసీ మౌనమేలా?
జీహెచ్ఎంసీ పరిధిలో అనుమతిలేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేస్తుంటే జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో క్షణాల్లో తొలగిస్తున్నారు. దీంతోపాటు భారీ మొత్తంలో పెనాల్టీ కూడా వసూలు చేస్తున్నారు. అయితే నెటిజన్లకు ట్వీట్లకు ఇంతవరకు సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్(సీఈసీ) స్పందించలేదు. ఇదిలా ఉండగా ఈనెల 21వ తేదీ నుంచే సాంకేతిక కారణాల పేరుతో పెనాల్టీ వేయడంలేదని సీఈసీ ప్రకటించింది. టీఆర్ఎస్ ప్లీనరీ నేపథ్యంలో కావాలనే ఇలా చేశారా? అని ప్రతిపక్షపార్టీల నేతలు మండిపడుతున్నారు.
యూత్ కాంగ్రెస్, బీజేపీ ఆందోళన
నగరంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెట్టడంపై యూత్ కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహంవద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తోరణాలను తొలగించారు. దీంతో నాయకులను అరెస్టు చేసి రాంగోపాల్‌పేట్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి.నిరంజన్ లేఖ రాశారు. టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు బీఆర్కే భవన్‌వద్ద సిటీ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్కు ఓ న్యాయం, ఇతర పార్టీలకు మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు.