Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు, సిబ్బందితో సమగ్రతా ప్రతిజ్ఞ చేయించిన అడిషినల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
దక్షిణ మధ్య రైల్వేలో విజిలెన్స్
అవగాహన వారోత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
దక్షిణ మధ్య రైల్వేలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ప్రారంభించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్, న్యూ ఢిల్లీ వారి మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు వీటిని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అడిషినల్ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మంగళవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో అధికారులు, సిబ్బందితో 'ప్రజా జీవితంలో అన్ని రంగాలలో అవినీతిని నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నాం' అనే లక్ష్యంగా సమగ్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఆరు డివిజన్లలో వివిధ విభాగాల అధిపతులు, ఇతర సీనియర్ అధికారులు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత దేశ స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వ పరిపాలనా నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభారు పటేల్ జయంతి (31 అక్టోబర్) సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులకు విజిలెన్స్ వ్యవస్థపై అవగాహనను కలిగించి అవినీతికి వ్యతిరేకంగా జాగృత పరిచి సమాజాన్ని అవినీతి రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య సమక్షంలో 29న వర్చువల్ సమావేశ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ వారమంతా దక్షిణ మధ్య రైల్వే సిబ్బందికి అవగాహన కలిగించడం కోసం సెమినార్లు/వర్క్‌షాపులు/విజ్ఞాన కార్యక్రమాలతో సహా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 31న సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద పాదయాత్ర కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందన్నారు. విజిలెన్స్/సాధారణ ఫిర్యాదులకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కలిగించేందుకు నవంబర్ 1న కాంట్రాక్టర్లు/విక్రేతలు , వినియోగదారులు పాల్గొనే వర్చువల్ సమావేశంతో పాల్గొంటారని తెలిపారు.