Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయ గర్జనతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగిపోవాలి
- కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
రాష్ట్రంలో రైతులు పండించిన ఆఖరి గింజ వరకు కొనుగోలు చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తూ మద్దతు ధర కల్పించేలా కేసీఆర్ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు రాకముందు రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడ్డారని కానీ నేడు తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ సర్కారు రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షల ఎకరాల పంటకు నీరందించిన ఘనత తమ సర్కారుకే దక్కిందని తెలిపారు. నవంబర్ 15న వరంగల్లో విజయ గర్జన పేరిట టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గాను సుమారు పది లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దానికి సంబంధించిన సభ ఏర్పాట్లపై మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాలలోని ముఖ్య కార్యకర్తల సమావేశం శామీర్పేట్లో 1,500 మందితో నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కో ఆప్షన్ సభ్యుడు దత్తాత్రేయ శాస్త్రి, టీఆర్ఎస్ నాయకులు మీసాల కృష్ణ, కొత్త చక్రపాణి గౌడ్, బొమ్మకు విశ్వనాథ్, బందారపు శ్రీధర్ గౌడ్, కొత్త రవి గౌడ్, ఉప్పరి విజరు, కీర్తన్ రెడ్డి, సామల మనోహర్ రెడ్డి, మోతే రాజు తదితరులు పాల్గొన్నారు.