Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన మున్సిపల్ గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, లేనిపక్షంలో తిరుగుబాటు తప్పదని కార్మికులు హెచ్చరించారు. కనీస వేతనాల జీఓలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర మున్సిపల్ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఒకరోజు రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. ఈసందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అనేది దోపిడీ వ్యవస్థ అని, అధికారం చేపట్టక ముందు బీరాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వారిని ఎందుకు పర్మినెంట్ చేయటం లేదని నిలదీశారు. కాంట్రాక్టర్లకు అనుగుణంగానే ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. కనీస వేతనాల జీఓల అమలు, మెరుగైన వేతనాల కోసం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎండీ యూసుఫ్ మాట్లాడుతూ 10 ఏండ్లు పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. పంచాయతీ, మున్సిపల్ వర్కర్లకు పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఉద్యోగులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేసి ఖాతాల్లో డబ్బులు జమచేయాలని కోరారు. కార్మికులు సహజ మరణం పొందితే రూ. 5లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10లక్షలు వచ్చే విధంగా బీమా పాలసీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీక్షలో మున్సిపల్ స్టాఫ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కె. ఏసురత్నం, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. వెంకటయ్య, మున్సిపల్ నాయకులు మార్టిన్, నాయకులు జయచంద్ర, సువర్ణ, లక్ష్మమ్మ, సతీష్ కుమార్, పి. మల్లయ్య, ఎన్. యాదగిరి, పాపమ్మ, నర్సిరెడ్డి పాల్గొన్నారు.