Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఏఐటీయూసీ వినతి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.ప్రేంపావని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ లతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి 14 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని పేద, బడుగు వర్గాల పిల్లలకు విద్యను అందించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం మధ్మాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. బాలబాలికలకు పౌష్టికాహార లోపం లేకుండా చేసేందుకు నెలకు 16 కోడిగుడ్లను తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి అందించాలని, ప్రాథమిక విద్యార్థికి మెస్ ఛార్జీ రూ.4.97 పైసల చొప్పున అప్పర్ ప్రయిమరీ హైస్కూల్ విద్యార్థులకు రూ.7.45 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నిత్యావసర, గ్యాస్ ధరల పెంపు, కోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్లో రూ.6 అమ్ముతున్నారని గుర్తు చేశారు. మెస్ ఛార్జీలు సరిపడక ఎన్నో వ్యయప్రయాసలకు తట్టుకుని, ఆహారాన్ని అందిస్తున్న కార్మికులకు కోడి గుడ్డుకు అదనంగా రూ.4 చెల్లించి విద్యార్థులకు అందించడం కార్మికులకు శక్తికి మించిన పని అవుతుందన్నారు. కనీస వేతనం కింద రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంట కార్మికులను 4క్లాస్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మెస్ బిల్లులు ప్రతినెలా 5వ తేదీ లోపు ఖాతాల్లో జమ చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలని వారు కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల రమేష్, వర్కింగ్ ఉమెన్ ఫోరమ్ నాయకురాలు జ్యోతి శ్రీమాన్, జంగం లక్ష్మి, నూనేటి రాధమ్మ, టి.కళావతి, ఓదెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.