Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి
నవతెలంగాణ-ధూల్‌పేట్
భాషాసాహిత్యాల అధ్యాపనం, పాఠ్యాంశం జీవితాన్ని గెలిచే శక్తినివ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. సిటీ కళాశాల శతాబ్ది వేడుకల్లో భాగంగా తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'డిగ్రీ తృతీయ ఏడాది పాఠ్యగ్రంథం సాహితీ దుందుభి-సృజనాత్మక బోధనా పద్ధతులు' అంతర్జాల జాతీయ కార్యశాల సమావేశాన్ని గౌరవ అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ తృతీయ ఏడాదిలో భాషాసాహిత్యాల అధ్యాపనం ప్రవేశపెట్టడం భారతదేశంలోనే గొప్ప సంస్కరణ అని, మారుతున్న జీవితానికి అవసరమైన నైపుణ్యాలను, కొత్త పాఠ్యాంశాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 'జర్నలిజం, ఇంటర్వ్యూ స్కిల్స్, ఉపన్యాసకళ, స్టడీ ప్రాజెక్టు' వంటి వినూత్న అంశాలను పాఠ్యభాగాలుగా రూపొందించటం వల్ల విద్యార్థులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటారని చెప్పారు. ఎంతో విలక్షణంగా సంప్రదాయ, ఆధునిక భాషా సాహిత్యాల సమన్వయ దృక్పథంతో 'సాహితీ దుందుభి' పాఠ్యగ్రంథాన్ని రూపొందించిన సంపాదకమండలిని అభినందించారు. సాంకేతిక సమావేశాల్లో వక్తలు తెలియజేసే విశేషాలతో బోధనా పద్ధతుల మాడ్యూల్‌ని తయారుజేయాలని కార్యశాల నిర్వాహకులను సూచించారు. సమావేశంలో పాఠ్యగ్రంథ సంపాదకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులు ప్రొఫెసర్ సూర్యా ధనాంజరు, సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.బాల భాస్కర్, తెలుగు శాఖాధ్యక్షులు అవధానం, కార్యశాల కన్వీసర్ డా.జె.నీరజ, కార్యశాల కోఆర్డినేటర్ డా.కోయి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.