Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హేమహేమీలున్నా పట్టించుకునే వారు కరువు
- సిటీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోలేని దుస్థితి
- గ్రేటర్లో ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ ఉనికి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జోష్ పెరిగినా.. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం సన్నగిల్లుతోంది. ప్రతి విషయానికీ గాంధీ భవన్ చుట్టూ తిరగడం తప్ప సిటీలో ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోలేని దుస్థితిలో ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకోసం పనిచేసేందుకు యువత ఉత్సాహంగా ఉన్నా, నాయకుల్లో హేమా హేమీలు ఉన్నా కొంత సమన్వయ లేమితో పరిస్థితి ఆశాజనకంగా లేదని ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో
రేవంత్‌రెడ్డి అధ్యక్షులయ్యాక రాష్ట్రంలో ఆ పార్టీ క్రమంగా పుంజుకుంటున్నప్పటికీ సిటీలో మాత్రం ఉనికిలో లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకులు కూడా ఎవరికివారే యమునా తీరే అన్నట్టు పార్టీ బలోపేతానికి పెద్దగా ప్రయత్నించడం లేదన్న చర్చ నడుస్తోంది. గ్రేటర్లో కాంగ్రెస్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. నగర అధ్యక్షులుగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్.. ప్రస్తుతం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో గ్రేటర్ కాంగ్రెస్ పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఇప్పటివరకు గ్రేటర్ కాంగ్రెస్‌కు కార్యాలయం కూడా లేదు. కనీసం ఏర్పాటు చేసుకోవాలనే సోయి సైతం నాయకులకు లేకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోందని ఆ పార్టీ సానుభూతిపరులు, విమర్శకులు చెప్తున్నారు. గతంలో నాంపల్లిలో ఆఫీసు ఉన్నప్పటికీ.. దానికి అద్దె చెల్లించకపోవడంతో తాళం వేశారు. అంతకుముందు కోఠి సెంటర్లో ఉండేది. ప్రస్తుతానికి గాంధీభవన్ మాత్రమే అన్నింటికీ వేదిక అయింది. సిటీలో బలమైన నాయకులు, ఉత్సాహవంతులైన క్యాడర్ ఉందని చెప్పుకుంటున్న ఆ పార్టీ నేతలు నగర కార్యాలయం ప్రారంభించుకోలేకపోతున్నారు. అధ్యక్షులుగా అంజన్ కుమార్ యాదవ్‌పై బాధ్యతలు ఉన్నప్పటికీ.. నిర్వహణ ఖర్చులు భరించలేక ఇతరులు సహకరించకపోవడంతో ఆయన ఆఫీసు తెరవడానికి జంకుతున్నారని తెలుస్తోంది. దీంతోపాటు ఆయనకు నగరపార్టీపై కమాడింగ్ పవర్ లేకపోవడం.. ఉన్నా నాయకులను సమన్వయపర్చకపోవడంతో వాళ్లందరూ అంజన్ కుమార్ యాదవ్‌కు దూరంగా ఉంటున్నారు.
ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి, ఆదం సంతోష్, పి˜రోజ్ ఖాన్, దాసోజు శ్రావణ్ కుమార్, రోహిణీ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మర్రి శశిధర్ రెడ్డి వంటి హేమహేమీలు ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ తన ఉనికిని చాటలేకపోతోంది. జీహెచ్ఎంసీ, అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో వరుస అపజయాలను చూవిచూసింది. జీహెచ్ఎంసీలో రెండు సీట్లకే పరిమితమైంది. రాష్ట్ర నాయకత్వమంతా ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది. ఈ ఫలితాల నుంచి కూడా గుణపాఠం నేర్చుకోకపోవడంతో బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అత్యధిక సీట్లు సాధించాయి. ఒకప్పుడు సిటీలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుని ఉనికి చాటిన కాంగ్రెస్ గ్రేటర్లో రెండు సీట్లకే పరిమితమవడంతోపాటు సిటీలో తన పరిధిని విస్తరించడం లేదు. నాయకులు తమ నియోజకవర్గాలు దాటి మరో నియోజకవర్గరంలో అడుగు పెట్టడం లేదు. ఐక్యత లేకపోవడంతో పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని స్వయానా కాంగ్రెస్ పార్టీ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. సిటీలో పార్టీ పటిష్టత, విస్తరణకు కార్యాలయం ఉండాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతుకుంటున్నాయి. దీని ద్వారా అక్కడి నుంచి నాయకులు, కార్యకర్తలకు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం సులువుతుందని అభిప్రాయపడుతున్నాయి. అంతేగాక క్షేత్రస్థాయిలో ఎదురువుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి.. తద్వారా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టవచ్చు. కానీ ప్రస్తుతం అలాంటి కార్యక్రమాలు ఏమి లేకపోవడంతో కార్యకర్తల్లో జోష్ కనిపించడం లేదు. రాష్ట్రస్థాయిలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో కీలకమైన గ్రేటర్‌పై దృష్టిపెట్టకపోవడంతో జనాలు ఆపార్టీని మర్చిపోయే పరిస్థితి నెలకొంది. అయితే హుజూరాబాద్ ఎన్నికలు పూర్తయిన వెంటనే గ్రేటర్‌కు నూతన అధ్యక్షులు, పార్టీ ఆఫీసును ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నగరంపై ప్రత్యేక దృష్టిసారించినట్టుగా, ఆదిశగా చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే ఒక నిర్ణయం వెలువడుతుందని సిటీలోని యూత్ కాంగ్రెస్ నాయకులొకరు తెలిపారు.