Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-బంజారాహిల్స్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌కు సబ్బండ వర్గాల మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ వల్లే రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. 2023 ఎన్నికలకు హుజూరాబాద్ బైపోల్ సెమీఫైనల్ అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యమై టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మరో 20 ఏండ్లు తానే సీఎం అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలు కండ్లు తెరవాలని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ అహంకారానికి, ఈటల ఆధిపత్యానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. ఓటర్లు ధర్మం, న్యాయం వైపు ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కన్వీనర్ నెహ్రూ నాయక్, మాల హక్కుల పోరాట సమితి కన్వీనర్ ఈసం లింగయ్య, కేంద్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు విక్రమ్ గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఇరుగు నరేందర్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, మైనార్టీ నాయకులు యూసుఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు.