Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని ఓయూ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం హెడ్ ప్రొఫెసర్ కె. స్టీవెన్ సన్ సూచించారు. అవసరం లేని సమాచారాన్ని ఫార్వర్డ్ చేయకూడదని చెప్పారు. 76వ ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలను శుక్రవారం ఓయూలో ఘనంగా నిర్వహించారు. ఈఏడాది ఐక్యరాజ్యసమితి థీమ్ 'గ్లోబల్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ వీక్' అనే అంశంపై ప్రొఫెసర్ స్టీవెన్సన్ ప్రసంగించారు. సరైన సమాచారాన్ని తీసుకుని, ఎంపిక చేసి ఫార్వర్డ్ చేయాలన్నారు. లేనిపక్షంలో అనవసర చిక్కులు తెచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో తప్పుడు సమాచారం సైతం విపరీతంగా వ్యాప్తి చెందుతోందని, దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. అంతకుముందు ఓయూ లైబ్రరీలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐసీఎస్ఎస్ఆర్-ఎస్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉషాకిరణ్, యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ ఏఎస్ చక్రవర్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎస్. యాదగిరి, డాక్టర్ ఆర్కే పవన్ కుమార్, యూఎన్ సెక్షన్ ఇన్చార్జి కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.