Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచర్లలోని రాధికానగర్ కాలనీలో పార్కు స్థలాన్ని పరిరక్షించేందుకు కృషిచేస్తున్న స్థానికులను బెదిరింపులకు గురిచేస్తున్న రాసాల మహేష్ అనే వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాలనీలోని సర్వే నెం.76/1 నుంచి 76/16 వరకు గల స్థలంలో రాసాల నర్సయ్య కుమారుడు కిష్టయ్య 1976లో లే అవుట్ చేసి అప్పటి గ్రామ పంచాయితీ నుంచి 72 ప్లాట్లకు అనుమతి పొంది, అందులో 70 ప్లాట్లను విక్రయించాడని తెలిపారు. మిగతా రెండు ప్లాట్లు 27, 28లలోని 366 చదరపు అడుగుల స్థలాన్ని పార్కు కోసం కేటాయించార న్నారు. అయితే తరువాత ఆయన కుమారుడు బాలమల్లేష్, మనవడు మహేష్‌లు పాత లే అవుట్‌ను మార్చి.. ప్లాట్ నెం. 27, 28లను ప్లాట్లుగా సూచిస్తూ మరో లే అవుట్‌ను క్రియేట్ చేశారని పేర్కొన్నారు. మొదట చేసిన లే అవుట్ ప్రకారం తాము స్థలాలను కొనుగోలు చేసి, ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్నామని చెప్పారు. ఈ మధ్యనే ప్లాట్ నెం.27, 28లలోని స్థలాన్ని పార్కు స్థలంగా సూచిస్తూ మున్సిపల్ అధికారులు బోర్డును పెట్టారని చెప్పారు. తాజాగా శుక్రవారం ఉదయం 10గంటలకు మహేష్ కొందరు వ్యక్తులతో అక్కడికి వచ్చి పార్కు స్థలం చుట్టూ రాళ్లుపాతుతుండగా తాము మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేయడంతో.. అధికారులు వెంటనే జోక్యం చేసుకొని పనులను నిలిపివేశారని వివరించారు. అయితే తమ వల్లనే పని ఆగిపోయిందంటూ రాసాల మహేష్ యాదవ్ శనివారం ఉదయం తమ ఇండ్ల వద్దకు వచ్చి అసభ్య పదజాలంతో అందరినీ దూషిస్తూ.. మరోసారి పార్కు స్థలమంటూ ఎవరైనా మాట్లాడితే 'వారి అంతు చూస్తా'నంటూ బెదిరింపులకు గురిచేశాడని కాలనీవాసులు తెలిపారు. అంతే కాకుండా కాలనీలోని ఒకరి ఇంటి గేటు లోపలికి వెళ్తుండగా తామంతా అడ్డుకున్నామని, కాలనీవాసు లకు రాసాల మహేష్ యాదవ్ కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించి తమను అసభ్య పదజాలంతో దూషించి, బెదిరింపులకు గురిచేసిన రాసాల మహేష్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకో వాలని కాలనీవాసులు మేడిపల్లి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అన్నె రాజేశ్వరి, శోభ, లలిత, కవిత, తాటి పద్మ, టి.స్వప్న, ఎం.స్వప్న, శారద, ప్రేమక్కుమార్, లక్ష్మి, సుజాత, సోమలక్ష్మి, వెంకటేష్, సోమాజీ, సుదీప్, మల్లేష్ తదితరులు ఉన్నారు.