Authorization
Wed April 09, 2025 09:33:17 pm
నవతెలంగాణ- మేడ్చల్ రూరల్
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే నినావత్ నరేష్ నాయక్ మృతి చెందాడని, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మేడ్చల్ పట్టణంలోని ప్రజ్ఞ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి యాజ మాన్యంతో గొడవకు దిగారు. శామీర్పేట మండలంలోని దేవరయంజాల్ గ్రామంలోగల మల్లన్న కాలనీలో నివాసం ఉంటున్న నినావత్ నరేష్ నాయక్(22) మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 315, 316, 324లో గల యూపీఎల్ లిమిటెడ్ పరిశ్రమలో పలు రిపేరింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం కరెంట్ షాక్కు గురయ్యాడు. దీంతో తోటి కార్మికులు అతనిని మేడ్చల్ పట్టణంలోని ప్రజ్ఞ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపయ్యాక అతని పరిస్థితి సీరియస్గా ఉందని, గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. కుటుంబ సభ్యులు అందుకు సిద్ధపడగా అప్పటికే నరేష్ నాయక్ మృతి చెందినట్లు గుర్తించి ఆందోళ నకు దిగారు. ఆస్పత్రి యాజమాన్యంతో గొడవకు దిగారు. ఆస్పత్రివద్దగల అంబులెన్స్ అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడి మృతదేహాన్ని మనోహరాబాద్ పోలీసులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, ప్రజ్ఞ ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.