Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
మోడీ హయాంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా పేదలు, బడుగు బలహీనవర్గాల కోసం చేసిందేమీ లేదనీ, వారు అధికారంలోకి వచ్చాక కుల, మత వైషమ్యాలు, కొట్లాటలు పెరిగాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. ఓ వైపు కరోనా వల్ల జనం తిండీ తిప్పల్లేక, వైద్యం సరిగ్గా అందక తండ్లాడుతుంటే ప్రధానమంత్రి మాత్రం దీపాలు వెలిగించండి, చప్పట్లు కొట్టండి అంటూ మూఢ నమ్మకాలను ప్రోత్సహించారని ఎద్దేవా చేశారు. మేడ్చల్ పట్టణంలోని నవభారత్ ఫంక్షన్ హాల్లో సీపీఐ(ఎం) మేడ్చల్-శామీర్పేట్ ఏరియా 4వ మహాసభలు జరిగాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన వీరయ్య పార్టీ జెండాను ఆవిష్కరించి సభలను ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కుల, మత కొట్లాటలు విచ్చలవిడిగా పెరిగిపోయాయనీ, ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే.. ఆ రాష్ట్రంలో కులాల కొట్లాటలు, మతాల కొట్లాటలు పెట్టి అధికారంలోకి రావాలని దుర్మార్గంగా ఆలోచిస్తున్నారని తెలిపారు. ఒకవైపు నిరుద్యోగం పెరిగి తిండిలేక పేదలు, బడుగు బలహీన వర్గాలు అవస్థలు పడుతుంటే.. వారి గురించి ఆలోచించకుండా కేవలం ఎన్నికల కోసమే ఆలోచించడం దుర్మార్గమైన చర్య అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు పోరాడుతుంటే.. పట్టించుకోకుండా ఉద్యమాన్ని అణచివేసే చర్యలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన కూడా కేంద్రంలోని బీజేపీ పాలనకంటే భిన్నంగా ఏమీ లేదన్నారు. కేంద్రంలో బీజేపీ లెక్కనే రాష్ట్రంలో కేసీఆర్ కూడా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలకోసం కాకుండా, కేవలం ఎన్నికల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నట్టు బీజేపీ, టీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దేశంలో 70 ఏండ్ల గత పాలకులకంటే.. ఏడేండ్ల నేటి పాలనా కాలంలో నాలుగింతలు అప్పులు పెంచి జనం నెత్తిన భారం వేస్తున్నారని చెప్పారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎ.అశోక్ మాట్లాడుతూ ఈ మహాసభల్లో ఎన్నుకునే నూతన కమిటీలు ఈ రెండు మండలాల సమస్యలపై కేంద్రీకరించి ప్రజలతో కలిసి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.