Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో నెలకొన్న సమస్యలు గుర్తించి సత్వర పరిష్కారం చూపేందుకు రూపొందించిన 'నమస్తే పీర్జాదిగూడ' కార్యక్రమం శుక్రవారం 15వ డివిజన్లో కొనసాగింది. నగర మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్తో పాటు మున్సిపల్ కమిషనర్ పి. రామకృష్ణారావు, వివిధ శాఖల అధికారులు స్థానికులను పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆయా కాలనీలలో విద్యుత్ సమస్యలు, రోడ్ల విస్తరణ, రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉందని, తద్వారా ప్రజలు రోగాల బారిన పడుతున్నామని తదితర సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ తొలి విడతగా కొన్ని డివిజన్లలో చేపడుతున్న నమస్తే పీర్జాదిగూడ కార్యక్రమంలో మౌలిక వసతుల లేమిని గుర్తించి, వాటి కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆయా డివిజన్ల పరిధిలో అంతర్గత రోడ్లు, డ్రయినేజీలు, నీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు, చెరువులు, కుంటలు, నాలాల అభివృద్ది, పునరుద్ధరణ, సీసీ కెమెరాల ఏర్పాటు వంటివి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ శ్రీనివాస్, ఏఈ వినీల్, నాయకులు బండారి రవీందర్, పప్పుల అంజిరెడ్డి, కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.