Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
వైఎంసీఏ, వైడబ్ల్యూసీఏ గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు నగరంలో 'వరల్డ్ వీక్ ఆఫ్ ప్రేయర్, ఫెలోషిప్-2021' పేరుతో కోవిడ్-19, చైల్డ్ లేబర్, గర్ల్ చైల్డ్ వంటి తదితర అంశాలపై అవగాహన సదస్సులు, ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డాక్టర్ జోనాథన్ ధర్మరాజ్, ఉపాధ్యక్షులు జి.ఎం.దీన్ దయాళ్, ప్రధాన కార్యదర్శి ప్రీస్ట్లీ గయాస్ (మసి చరణ్), మాజీ ప్రధాన కార్యదర్శి బి.జె.వినరు స్వరూప్ తెలిపారు. సోమవారం నారాయణగూడ వైఎంసీఏ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వరల్డ్ వీక్ ఆఫ్ ప్రేయర్ పేరుతో హైదరాబాద్ నగరంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 7న సీఎస్ఐ సెంటినరీ వెస్లీ చర్చలో ప్రార్థన, ఆరాధన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈవారం రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లోని అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలలో భోజన కార్యక్రమాలు, ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు, బట్టలు, పండ్లు వంటివి పంపిణీ చేస్తామన్నారు. ఈకార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మైఖేల్ కోలా మినిస్ట్రీస్ నుంచి ఇంగ్లీష్ సర్వీస్ ఫాస్టర్ మైఖేల్ కోలా, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని వారు తెలిపారు. కార్యక్రమంలో వైడబ్ల్యూసీఏ అధ్యక్షులు మిసిస్ బ్లాలా ప్రిలిప్, ప్రధాన కార్యదర్శి రాణి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.