Authorization
Thu April 10, 2025 04:09:20 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) రాష్ట్రంలోనే కీలకమైన కేంద్రం. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలంతా ఒక ఎత్తయితే జీహెచ్ఎంసీ మరోఎత్తు. ఇక్కడి కార్పొరేటర్లు, స్థాయీ సంఘం, పాలకమండలి విస్తృత అధికారాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉంటుంది. మేయర్‌కు కేబినెట్ ర్యాంకు. వీటన్నింటిలో స్థాయి సంఘం సభ్యులు అంటే ప్రత్యేక హోదా. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు తీవ్రమైన పోటీ నెలకొంది. గతేడాది టీఆర్ఎస్, మజ్లిస్పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పోటీచేయడంతో ఏకగ్రీవంగానే ఎన్నుకోబడ్డారు. ఈసారి సైతం టీఆర్ఎస్, మజ్లిస్పార్టీలు ఒప్పందంలో భాగంగానే పోటీచేయనున్నాయి. ఇదిలా ఉండగా బీజేపీ సైతం పోటీచేయాలని నిర్ణయించింది. దీంతో ఈసారి త్రిముఖ పోటీ నెలకోనున్నది.
స్టాండింగ్ కమిటీ నేపథ్యం
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్) ఏర్పడినప్పటి నుంచి స్టాండింగ్ కమిటీ ఉన్నది. మేయర్‌తోపాటు స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా మరో వ్యక్తి ఉండేవారు. క్రమంగా స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా మేయర్ ఉండేలా మార్చేశారు. 2007లో ఎంసీహెచ్‌ను జీహెచ్ఎంసీగా మార్చిన తర్వాత 2009లో పాలకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి 2021 ఫిబ్రవరి 10వరకు స్టాండింగ్ కమిటీ చైర్మెన్ పదవి ఉన్నది. గ్రేటర్లో ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి, తక్షణమే పనులు మంజూరు చేయడానికి ప్రతివారంలో ఒక రోజు స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. అయితే రూ.2 కోట్లలోపు పనులకు కమిషనర్ స్థాయిలో మంజూరుచేయడానికి అవకాశముంది. రూ.2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు మంజూరు చేయాలంటే స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించాల్సి ఉంది.
బలం లేకపోయినా బరిలో....
జీహెచ్ఎంసీలో 150 వార్డులకుగాను టీఆర్ఎస్కు 56, మజ్లిస్‌పార్టీకి 44, బీజేపీకి 47, కాంగ్రెస్‌కు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సీక్రెట్ ఓటింగ్ ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. అత్యధిక ఓట్లు వచ్చినవారినే విజేతలుగా ప్రకటిస్తారు. అయితే 2009లో కాంగ్రెస్‌పార్టీతో, 2016లో టీఆర్ఎస్తో ఎంఐఎం పార్టీ ఒప్పందం చేసుకుని స్టాండింగ్ ఎన్నికల్లో గెలుస్తోంది. ఈ సారికూడా టీఆర్ఎస్, మజ్లిస్పార్టీలు కలిసి పోటీచేస్తాయి. కానీ 47 మంది సభ్యులు ఉన్న బీజేపీ సరిపోను బలంలేకపోయినా పోటీకి సిద్ధపడింది. సీక్రెట్ ఓటింగ్ కావడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు తమకు ఓటు వేస్తారని, ఒక్కస్థానమైనా గెలవాలనే ధీమాలో బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఏం జరుగుతుంతో చూడాల్సిందే.
సగం..సగం
15మందితో కూడిన స్టాండింగ్ కమిటీ సభ్యులను టీఆర్ఎస్, మజ్లిస్పార్టీలు సగం సగం పంచుకోనున్నాయి. ఐదేండ్ల పాలంలో ఏడాదికొకసారి కొత్త సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలిపిన మజ్లిస్‌పార్టీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 8 మంది సభ్యులను దక్కించుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 11వరకు నామినేషన్ల వేయడానికి సమయం ఉంది. ఈనెల 20న పోలింగ్తోపాటు ఫలితాలను సైతం ప్రకటించనున్నారు.